ఐపీయల్-2020: చెన్నై మీద ఢిల్లీ ఘన విజయం ,సెంచరీ చేసిన ధావన్, ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర

dc won the match against chennai

షార్జా: ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. షార్జాలో చెన్నై జట్టును ఓడించి.. మరోసారి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో విరుచుకుపడడంతో ధోనీ సేన ఓటమి పాలయింది. 6 వికెట్ల తేడాతో డీసీ కుర్రాళ్లు ఘన విజయం సాధించారు. 19.5 ఓవర్లలోనే 180 పరుగుల లక్ష్యంతో చేధించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 58 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో ధావన్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. స్టోయినిస్ 24, శ్రేయాస్ అయ్యర్ 23 రన్స్ చేశారు. చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. 5 బంతుల్లోనే 21 పరుగులతో విధ్వంసం సృష్టించాడు ఈ ఆల్‌రౌండర్. వాస్తవానికి ఢిల్లీ జట్టుకు ఫస్ట్ ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే దీపక్ చాహర్ బౌలింగ్‌లో పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. రహానే కూడా మరోసారి విఫలమయ్యాడు. వికెట్లు పడుతున్నా శిఖర్ ధావన్ మాత్రం దూకుడును కొనసాగించాడు. శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో అలెక్స్ కేరీ, అక్షర్ పటేల్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేసి.. ఢిల్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు గబ్బర్.

ఆఖరి రెండు ఓవర్లలో 21 పరుగులు కావాల్సిన వేళ 19వ ఓవర్‌ సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి అలెక్స్ కేరీ ఔట్ అయ్యాడు. మిగిలిన ఐదు బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. ఆ సమయంలో బంతిని జడేజాను అప్పగించాడు ధోనీ. మొదటి బంతి వైడ్ వెళ్లింది. ఆ తర్వాతి బంతిని శిఖర్ ధావన్ సింగిల్ తీశాడు. రెండో బంతిని అక్షర్ పటేల్ సిక్స్ కొట్టాడు. మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీయడంతో స్కోర్లు సమయం అయ్యాయి. అనూహ్యంగా ఐదో బంతిని కూడా భారీ సిక్స్ కొట్టి ఢిల్లీ జట్టును గెలిపించాడు అక్షర్ పటేల్.

చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో, శామ్ కరన్ తలో వికెట్ సాధించారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 47 బంతుల్లో 58 రన్స్ చేశాడు. ఇక రాయుడు 45 (25 బంతులు), షేన్ వాట్సన్ 36 (28 బంతులు), రవీంద్ర జడేజా (33) పరుగులతో రాణించారు. సామ్ కరన్ (0), ధోనీ (3) మాత్రం విఫలమయ్యారు. వాస్తానికి చెన్నై జట్టు తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తుషార్ బౌలింగ్‌లో నార్జీకి క్యాచ్ ఇచ్చి కరన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత డుప్లెసిస్, వాట్సన్ ఆచితూడి ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జట్టుకు విలువైన భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోర్ 87 వద్ద వాట్సన్, 109 పరుగుల వద్ద డుప్లెసిస్, 129 వద్ద ధోనీ ఔట్ అయ్యారు. ఆ తర్వాత రాయుడు, జడేజా మెరుపులు మెరిపించడంతో చెన్నై టీమ్ భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో నార్జీ 2 వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడ తలో వికెట్ సాధించారు.

కాగా, ఐపీఎల్ 2020లో రెండు సార్లు ఈ జట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది మరోసారి పైచేయి సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు డీసీ, సీఎస్‌కే జట్లు 22 సార్లు తలపడ్డాయి. చెన్నై టీమ్ 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 8 మాత్రమే గెలుపొందింది.

ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న ధోనీ సేనకు మరో ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గెలిచినప్పటికీ అదే ఫామ్‌ను కొనసాగించలేకపోయింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన కేవలం మూడు మ్యాచ్‌లే గెలిచింది. మరో ఆరింటిలో పరాజయం పాలయింది. ప్రస్తుతం 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్లింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయాస్ సేన.. 7 మ్యాచ్‌ల్లో గెలిచి 14 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది.