తడబడి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్… ఐపీఎల్-2020 ఫైనల్ లో ముంబై తో ఢిల్లీ క్యాపిటల్స్ సమరం

Delhi Capitals win by 17 runs and march into the finals of Dream11 IPL-2020

ఐపీఎల్-2020: సీజన్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అడుగుపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అబుదాబి వేదికగా ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్‌లో తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ (78: 50 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన హైదరాబాద్ ఆఖరికి 172/8కే పరిమితమైంది. ముంబయి ఇండియన్స్‌తో దుబాయ్‌ వేదికగా మంగళవారం రాత్రి ఫైనల్లో ఢిల్లీ ఢీకొట్టనుంది.

టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. శిఖర్ ధావన్‌తో కలిసి అనూహ్యంగా ఓపెనర్‌గా వచ్చిన మార్కస్ స్టాయినిస్ (38: 27 బంతుల్లో 5×4, 1×6) వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆరంభంలోనే జేసన్ హోల్డర్ క్యాచ్ వదిలేయడంతో జీవనదానం పొందిన స్టాయినిస్.. అదే హోల్డర్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు. మరోవైపు ధావన్ కూడా జోరందుకోవడంతో 8.1 ఓవర్లలోనే ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ తెలివిగా స్టాయినిస్‌ని క్లీన్ బౌల్డ్ చేయగా.. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (21: 20 బంతుల్లో 1×4) వేగంగా ఆడలేకపోయాడు. కానీ.. శ్రేయాస్ ఔట్ తర్వాత వచ్చిన సిమ్రాన్ హిట్‌మెయర్ (42 నాటౌట్: 22 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడేయగా.. ధావన్ కూడా కాస్త బ్యాట్ ఝళిపించాడు. దాంతో.. ఢిల్లీ 189 పరుగులు చేయగలిగింది.

190 పరుగుల లక్ష్య ఛేదనని హైదరాబాద్ పేలవంగా ఆరంభించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (2) ఔటవగా.. ప్రయోగాత్మక ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (17: 12 బంతుల్లో 2×6) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయినప్పటికీ.. మనీశ్ పాండే (21: 14 బంతుల్లో 3×4)తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దిన కేన్ విలియమ్సన్ (67: 45 బంతుల్లో 5×4, 4×6) హైదరాబాద్‌ని గెలిపించేలా కనిపించాడు. కానీ.. పాండేని స్టాయినిస్ ఔట్ చేయగా.. అనంతరం వచ్చిన జేసన్ హోల్డర్ (11: 15 బంతుల్లో 1×4) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. మ్యాచ్‌పై ఢిల్లీకి పట్టు చిక్కింది. కానీ.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అబ్దుల్ సమద్ (33: 16 బంతుల్లో 2×4, 2×6) కాసేపు భారీ షాట్లు ఆడేయగా.. విలియమ్సన్ కూడా అందుకున్నాడు. దాంతో.. ఢిల్లీలో మళ్లీ కంగారు మొదలైంది.

Delhi Capitals win by 17 runs and march into the finals of Dream11 IPL-2020
Delhi Capitals win by 17 runs and march into the finals of Dream11 IPL-2020

కానీ.. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో విలియమ్సన్‌ని స్టాయినిస్ ఔట్ చేసి మ్యాచ్‌ని మలుపు తిప్పగా.. రషీద్ ఖాన్ (11: 7 బంతుల్లో 1×4, 1×6) మెరుపులు ఒక ఓవర్‌కే పరిమితమయ్యాయి. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన రబాడ.. వరుస బంతుల్లో అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, శ్రీవాత్స గోస్వామిల(0)ను ఔట్ చేయడంతో మ్యాచ్‌పై ఆశల్ని హైదరాబాద్ వదులుకుంది. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమవగా.. నోర్తేజ్ 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.