ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఎదురైన పరాజయం జట్టు సహ యజమాని ప్రీతి జింటాను తీవ్రంగా కలిచివేసింది. బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరిత తుదిపోరులో కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి చెందిన పంజాబ్ జట్టును చూసి ప్రీతి జింటా భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ అనంతరం ఆమె ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు అభిమానులను సైతం కలచివేశాయి.
నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ ముగిసిన తర్వాత ఆర్సీబీ విజయం సంబరాల మధ్య మునిగితేలగా, పంజాబ్ డగౌట్‌లో మాత్రం ఓటమి కడుపు మంటగా మారింది. ఎరుపు-తెలుపు జెర్సీలో మెరిసిన ప్రీతి జింటా, తన జట్టు పరాజయాన్ని జీర్ణించుకోలేక బాధపడిన తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఆమె కుర్చీకి ఆనుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది.
ఫ్యాన్స్ మాత్రం ప్రీతి అంకితాన్ని గుర్తు చేస్తూ “#PreityZinta” హ్యాష్‌ట్యాగ్‌తో సందేశాల వరద పారిస్తున్నారు. “ఈ అమ్మాయికి ఒక్కసారి ఐపీఎల్ ట్రోఫీ అందాలని ఉంది” అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ ఫైనల్‌కు హాజరై ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిన ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
మ్యాచ్ తర్వాత ప్రీతి తన భావోద్వేగాలను పక్కన పెట్టి ఆటగాళ్లకు అండగా నిలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇతర ఆటగాళ్లను ఆమె ఓదార్చిన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఓటమిలోనూ క్రీడాస్ఫూర్తిని చూపిన ప్రీతి జింటా వైపు అభిమానుల గౌరవం మరింత పెరిగిందన్న మాట.