ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి గులాబీ బంతిని ఎదుర్కొన్న టీమ్‌ఇండియా తక్కువ స్కోర్‌కే చతికిలబడింది. రోహిత్, ఇషాంత్ శర్మ, జడేజా గైర్హాజరుతో ఎలా ఆడుతుంది అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో క్రికెట్ అభిమానులని దారుణంగా నిరాశపరిచారు. తొలి రోజు ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసిన టీమిండియా ఈ రోజు మరో 11 పరుగులు చేసి ఆలౌటైంది. నలుగురు బ్యాట్స్‌మెన్స్‌కి ఔట్ చేయడానికి ఆసీస్ బౌలర్స్ కేవలం 23 నిమిషాలు మాత్రమే తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం 233/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించారు సాహా (9), అశ్విన్ (15) . ఈ రోజు ఒక్క పరుగు కూడా చేయకుండానే అశ్విన్ వెనుదిరిగాడు. ఆయన తర్వాత సాహా, ఉమేష్ యాదవ్, షమీ ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి పెవీలియన్‌కు వెళ్ళారు. ఆస్ట్రేలియా బౌలర్స్‌లో స్టార్క్ 4 వికెట్స్ తీయగా, కమిన్స్ మూడు వికెట్స్ తీసారు. హాజిల్‌వుడ్, లియాన్‌కు చెరో వికెట్ దక్కింది. ఇక బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ భారత బౌలర్స్‌ని సమర్ధంగా ఎదుర్కొంటున్నారు.
గురువారం అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కోహ్లీ. రెండో బంతికే పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరగగా, మయాంక్ అగర్వాల్ (17: 40 బంతుల్లో 2×4) ,చతేశ్వర్ పుజారా (43: 160 బంతుల్లో 2×4) , విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8×4) , అజింక్య రహానె (42: 92 బంతుల్లో 3×4, 1×6) కొంత పర్వాలేదనిపించారు. కోహ్లీ ఉన్నంత సేపు మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించగా, రహానే తప్పిదం వలన కోహ్లీ రనౌట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ అందరు ఒకరి తర్వాత మరొకరం అన్నట్టు పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్ల కచ్చితత్వం, అదనపు బౌన్స్, చివర్లో స్వింగైన పింక్ బంతితో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం చెమటోడ్చారు.