ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆసీస్ బౌలర్లపై తొలి ఓవర్ నుంచే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న రోహిత్‌శర్మ- శిఖర్ ధవన్ ఓపెనింగ్ జోడీ ఈ మ్యాచ్‌లో చెలరేగింది.
ఓపెనర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 95 పరుగుల వద్ద అవుటై సెంచరీని మిస్ చేసుకోగా, ధవన్ కెరీర్‌లో 16వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మొత్తం 115 బంతులు ఎదుర్కొన్న ధవన్ 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 143 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ నిరాశ పరిచినా రిషభ్ పంత్ (36), విజయ్ శంకర్ (26) మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా, రిచర్డ్‌సన్ 3, ఆడం జంపా ఓ వికెట్ పడగొట్టాడు.