ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభమైన వేళ రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత గత కొన్ని నెలలుగా రాజకీయంగా కాస్త స్తబ్దతగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి.. ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. ప్రభుత్వం తరఫున వరుసగా కేసులు నమోదవుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఎవరూ వెనక్కి తగ్గడం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొన్నటి వరకు వ్యూహాత్మక మౌనం పాటించిన కీలక నాయకులంతా ఇప్పుడు జనం మధ్యకు వస్తూ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్‌లో స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తాజా ఉదాహరణ పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలే అని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినప్పటికీ, ఆయన అనుచరులతో కలిసి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ తన పంథాను మార్చుకోలేదు.
కేవలం పల్నాడులోనే కాకుండా, కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు కీలక నేతలు, గతంలో కేసులకు భయపడి సైలెంట్ అయిపోయారనే ప్రచారం జరిగిన వారంతా.. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా వీరంతా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల ఈ హఠాత్ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను, స్థానిక సమస్యలను క్యాష్ చేసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే సరైన వేదికని ఆ పార్టీ భావిస్తోంది. భయపడి ఇంట్లోనే కూర్చుంటే క్యాడర్ పూర్తిగా చేజారిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు.. ఇప్పుడు కేసులను ఎదుర్కొనేందుకైనా సిద్ధమే తప్ప గ్రౌండ్ వదిలేది లేదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఈ మున్సిపల్ పోరు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింత హోరాహోరీగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.