తెలంగాణలో ఇసోంటి పంతులమ్మలు ఎందరున్నరు (వీడియో)

 

సేవా రంగాలన్నీ వ్యాపారమయమైపోతున్న కాలమిది. నేడు ప్రభుత్వ కొలువులు చేసే పంతుళ్ల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతున్న సమయం. కానీ ఈ పంతులమ్మ మాత్రం అలా కాదు. ఆమె కేవలం జీతం కోసమే పనిచేసి చేతులు దులుపుకునిపోయే రకం కాదు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి వాళ్ల మనసు గెలిచారు. అందుకే ఈ పంతులమ్మ బదిలీ అయితే పిల్లలు తట్టుకోలేకపోయారు. నిన్ను పోనీయం అంటూ ఏడుస్తూ అడ్డుకున్నారు. దాంతో వాళ్ల ఆవేదన చూసిన పంతులమ్మ కూడా ఏడ్చారు. నేను ఎక్కడికీ పోను అంటూ వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. తనకంటే మంచి టీచర్ వస్తారని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ టీచర్ పోస్టు వచ్చిన మరుసటి నుంచే కొందరు ప్రబుద్ధులు వ్యాపారం షురూ చేస్తారు. అయితే రియల్ ఎస్టేట్ లేదంటే చిట్టీల వ్యాపారం, ఇంకా కాదంటే ఎల్ఐసి, అదీ కాదంటే ఇంకా ఏదో ఒక దందా చేసి డబ్బులు సంపాదించి కోట్లకు పడగలెత్తే ప్రయత్నం చేస్తారు. బడికి బంక్ కొడతారు. పాఠాలు చెప్పుడు బందు పెడతారు. రాత్రిబంవళ్లు వ్యాపారకాంక్షతో రగిలిపోతారు. తరగతి గదిలో పాఠాలు చెప్పి వారి జీవితాలు బాగు చేయాలన్న ముచ్చటే మరచిపోతారు. బడికి పోయి నిద్ర పోతారు. కానీ అందరూ అలా కాదు. కొందరు ఈ పంతులమ్మ మాదిరిగా ఉంటారు. జీతం కోసం పనిచేయడం కాదు జీవితాలు తీర్చిదిద్దేందుకు పనిచేస్తారు.
పైన వీడియోలో కనబడుతున్న పంతులమ్మ పేరు గ్యాబ్రియల్. ఈమె నివాసం హైదరాబాద్ లోని చంపాపేట్. నిన్నటి వరకు చదువు చెప్పే ప్రాంతం కొంగర కలాన్. ఇటీవల టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆమె బదిలీ అభ్యర్థన పెట్టుకున్నారు. ఆమెకు ఉప్పల్ లోని భరత్ నగర్ కు బదిలీ అయింది. దీంతో బడికి పోయి వెళ్లొస్తా అని పిల్లకు చెప్పింది ఈ పంతులమ్మ. దీంతో టీచర్ ను పట్టుకుని పోరగాళ్లు కదలనీయలేదు. పోవద్దంటూ పెద్ద పెట్టున ఏడ్చారు. ఈ ఘటన చూసిన వాళ్లు కూడా ఇలాంటి పంతులమ్మలు ఊరికొక్కరు ఉంటే ఎంత బాగుండు అని మనసులోనే అనుకున్నారు. ఈ టీచర్ ను చూసైనా సర్కారు బళ్లలో చదువులు చెప్పే పంతుళ్లు మారాల్సిన అవసరం ఉంది.