Chandra Babu: టీచర్ గా మారిన చంద్రబాబు.. స్టూడెంట్ గా నారా లోకేష్?

Chandra Babu: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. అయితే నేడు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

జడ్పీ పాఠశాలలోని పదో తరగతి, 8వ తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదిని పరిశీలించిన సీఎం చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్పూర్తిని నింపేలా కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలను కూడా అందుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు.అనంతరం కాసేపు ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు, సోషల్ సైన్స్ పాఠాన్ని 8వ తరగతి విద్యార్థులకు బోధించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చెప్పిన పాఠాన్ని ఒక విద్యార్ధిలా శ్రద్ధగా మంత్రి నారా లోకేష్ విన్నారు.

ఆ పాఠశాలలోని విద్యార్థులు సైతం ఆసక్తిగా, శ్రద్ధగా చంద్రబాబు నాయుడు బోధించిన పాఠాన్ని విన్నారు. ఇలా తండ్రి గురువుగా మారడం కొడుకు శిష్యుడుగా మారినటువంటి ఈ సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల చదువు గురించి స్వయంగా ఉపాధ్యాయులతో తల్లితండ్రులు మాట్లాడి తెలుసుకునే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.