సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌లా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటకు వస్తున్నాయి. మొదటగా టిక్ టాక్ పరిచయం, దేవరాజ్ రెడ్డి బెదిరింపులు, ప్రైవేట్ ఫోటోల కోసం డబ్బులు డిమాండ్ చేశారంటూ శ్రావణి బంధువులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయితే అవి కేవలం ఆరోపణలే అంటూ శ్రావణి ప్రేమికుడు దేవరాజ్ రెడ్డి ఓ ఆడియోను విడుదల చేశాడు.
దేవరాజ్ రెడ్డి విడుదల చేసిన ఆడియోను బట్టి.. శ్రావణి ఆత్మహత్యకు ఆమె బంధువులు, సాయి అనే మరో వ్యక్తి కారణమని చెప్పుకొచ్చాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, డబ్బుల కోసం ఎప్పుడూ బెదిరించలేదని, ఈ మధ్య ఓ రెస్టారెంట్‌కు వెళ్తే సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిని కొట్టాడని, లాక్కెళ్లాడని ఆరోపించాడు. బంధువులు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని దేవరాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా సాయి అనే వ్యక్తి మరో ఆడియోను లీక్ చేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి ఫ్రెండ్‌నని చెప్పాడు. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని.. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశాడు. సాయి లీక్ చేసిన ఆడియోలో.. ‘మర్యాదగా వచ్చి గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవని దేవరాజ్ బెదిరించగా, ‘ఇంతటితో ఆపేయ్.. నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు.. నీతో మాట్లాడను సారీ దేవ’ అంటూ శ్రావణి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి అసలు కథ ఏంటి? ఆత్మహత్యకు గల కారణాలేంటో బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.