ప్రతినాయక పాత్రల్లో కనిపించే రామిరెడ్డి గురించి ఎవరికీ తెలియని విషయాలు!

రామిరెడ్డి ఒక భారతీయ నటుడు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ, భోజ్ పురి భాషలలో ప్రతి నాయకుడిగా 250 చిత్రాలలో నటించాడు. ఈయన చిత్తూరు జిల్లాలోని ఓబులంవారిపల్లెలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా హైదరాబాదులో కొనసాగింది.

ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో పట్టా తీసుకున్నాడు. సినిమాలలోకి రాకముందు ఒక ఉర్దూ పత్రికలో విలేఖరిగా చేశాడు. 1989లో రాజశేఖర్ నటించిన అంకుశం చిత్రంలో ప్రతి నాయకుడుగా నటించి, మొదటి సినిమాతోనే నంది పురస్కారం అందుకున్నాడు. ఈయనను చాలామంది అంకుశం రామిరెడ్డి అని పిలిచేవారు.

అయితే ఈయన ముందుగా దర్శకుడు, నిర్మాతగా రాణించాలని ప్రయత్నాలు చేసి అంకుశం సినిమా ద్వారా ప్రతినాయక పాత్రలు వరుసగా రావడంతో ఇక విలన్ పాత్రలకే పరిమితం అయ్యాడు. అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంద్ పేరుతో పునర్నిర్మాణం చేస్తే అందులో కూడా విలన్ గా నటించడం జరిగింది.

ఆ తరువాత ఒసేయ్ రాములమ్మ, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవి చుక్క, నాగ ప్రతిష్ట, తెలుగోడు లాంటి సినిమాలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి సినిమాలో ప్రతినాయక పాత్రలో రామిరెడ్డి ఉంటేనే బాగుంటుంది అని అనుకునేలా పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఆఖరి చిత్రం మర్మం. ఒకసారి 2007లో హైదరాబాదులోని మెహదీపట్నం లో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి, మరుసటి రోజు బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

కొంతకాలం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో ఆయనను చూసిన వారంతా ముఖంలో తేజస్సు తగ్గడం, ఇంతకుముందులా కాకుండా బలహీనంగా, బక్కగా ఉండడం చూసి జీర్ణించుకోలేక పోయారు. కానీ దురదృష్టవశాత్తు మళ్లీ మూత్రపిండాల వ్యాధితోనే హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2011లో తుది శ్వాసను విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.