14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. ఈ రీజన్ వల్లే 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మినహా టీడీపీ ఎక్కడా గెలవలేదు. సీఎం జగన్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకోగా చంద్రబాబు మాత్రం చిత్తూరులో కుప్పం మినహా మరెక్కడా పార్టీని గెలిపించుకోలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రస్తుతం జగన్ సైతం చంద్రబాబు చేసిన తప్పునే రిపీట్ చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న జగన్ మిగతా నియోజకవర్గాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో కడప జిల్లా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ముఖ్యమంత్రి కావడం వెనుక కడప జిల్లా ప్రజల పాత్ర ఎంతో ఉంది.
ఇతర పార్టీల నేతలు ఎన్ని విమర్శలు చేసినా కడప జిల్లా ప్రజలు ఏ ఎన్నికలు జరిగినా వైసీపీనే సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీడీపీ కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కడపలో ప్రభావం చూపే విషయంలో ఫెయిలైంది. అయితే వైఎస్సార్ హయాంలో కడపలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగితే జగన్ హయాంలో మాత్రం భారీ రేంజ్ లో అభివృద్ధి అస్సలు జరగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేసినా వైసీపీ నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జగన్ ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో కడపలో వైసీపీ ఎమ్మెల్యేలకు మెజారిటీ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ చెబుతున్న మాటలకు నిధుల విడుదలకు పొంతన లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.