అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు జనం. ఈ భయాందోళనలకు కారణం రౌడీలో, గూండాలో కాదు సాక్షాత్తు రాజకీయ నాయకులు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న తాడిపత్రి సున్నితమైన ప్రాంతం. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో, హత్యలతో అట్టుడికిన ఈ ప్రాంతం కొన్నేళ్లుగా ప్రశాంతంగానే ఉంది. కానీ లోపల మాత్రం కక్షలు, పంతాలు నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నాయని, కదిలిస్తే కార్చిచ్చులా వ్యాపిస్తాయని అందరికీ తెలుసు. అందుకే సామాన్య జనం వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతుండగా ఫ్యాక్షన్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన లీడర్లు మాత్రం ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారు.
తాజాగా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి, నట్టింట్లో కూర్చొని ఆయన అనుచరుడి మీద దాడి చేశారు. ఇంకేముంది ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం, రాళ్ళ యుద్ధం జరిగింది. ఒకానొక దశలో గొడవ పెద్దదైపోతుందని భయపడ్డారు స్థానికులు. ఇంత గొడవ జరగడానికి కారణం ఏమిటయ్యా అంటే పెద్దదేమీ కాదు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మీద కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారట. ఇసుక విషయంలో అబాండాలు వేస్తున్నారట. అదే ఎమ్మెల్యేను నేరుగా ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకు దాడిచేసేంతవరకు తీసుకొచ్చిందట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మనుషుల్ని వెంటబెట్టుకుని రాజకీయ ప్రత్యర్థి ఇంటి మీద దాడిచేయడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
ఆరోపణల్లో నిజం లేకపోతే సదరు ఎమ్మెల్యే నేరుగా పోలీసులకు పిర్యాదు చేయవచ్చు. ఈమధ్య ఎలాగూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. ఆ వెసులుబాటును వాడుకోవచ్చు కదా. లేకపోతె నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్లి కపిర్యాధు చేయవచ్చు. అలా కూడ చేయలేదు. ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా నేరుగా మనుషుల్ని, భద్రతా సిబ్బందిని వెంటేసుకుని జేసీ ఇంటికి వెళ్లి అక్కడున్న ఒంటరి వ్యక్తిని చితగ్గొట్టి వచ్చారు. ఈ పరిణామం పట్ల ఎమ్మెల్యే, వైసీపీ వర్గాలు తమకు అనుకూలమైన స్పందనే ఇస్తాయి. కాబట్టి అన్నీ తెలిసిన జనమే ఎమ్మెల్యే చేసిన పని సరైనదో కాదో తేల్చేస్తే బాగుంటుంది.
[yop_poll id=”7″]