పవన్ కళ్యాణ్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే వైసీపీ నేత ఎక్కడ.?

మాజీ మంత్రి పేర్ని నాని భలే మాటకారి.! కానీ, ఆయనా తేలిపోయారు. మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఆయన కూడా ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వైసీపీ నుంచి చాలామంది నేతలు, జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

గడచిన మూడేళ్ళుగా.. ఆ మాటకొస్తే, అంతకు ముందు ఐదేళ్ళ నుంచీ జనసేన మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే వున్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వుంది. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతల విమర్శలు పాతబడిపోయాయి. ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు.. ఇవన్నీ పాత మాటలే. కొత్తగా జనసేన అధినేత మీద విమర్శలు చేయడానికి వైసీపీ నేతల దగ్గర కంటెంట్ లేకుండా పోయింది.

ఏమయ్యారు వైసీపీలో గట్టిగా మాట్లాడగలిగే నాయకులంతా.? విశాఖ గర్జన తర్వాత వైసీపీలో కొంత నిస్తేజం అలముకున్నమాట వాస్తవం. వైవీ సుబ్బారెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలు చాలామంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. గర్జన సూపర్ సక్సెస్ అయ్యిందని వైసీపీ చెప్పుకుందిగానీ, అనుకున్నస్థాయిలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోలేకపోయామన్న భావన ఆ పార్టీలో వుంది.

పైగా, పవన్ కళ్యాణ్ విశాఖ రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీ చెబుతున్న లక్ష మంది గర్జనకు రాలేదు. అందులో పదోవంతు కూడా రాలేదని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. ఇంకోపక్క దాదాపు ఐదు లక్షల మంది జనసేనాని కోసం వచ్చారన్నది వైసీపీ దగ్గర వున్న సమాచారం.

అంతలా జనసేనాని ‘షో’ చేయడం వెనుక చంద్రబాబు వున్నారనే అనుకున్నా, పరోక్షంగా అది ఏకైక రాజధాని అమరావతికి ఉత్తరాంధ్ర మద్దతిచ్చిందనే నిర్ణయానికి వైసీపీ వచ్చేసింది. సరిగ్గా ఈ టైమ్‌లోనే వైసీపీ మీద తన విమర్శల స్థాయిని పవన్ కళ్యాణ్ పెంచేశారు. నిజానికి, పవన్ కళ్యాణ్కి వచ్చిన మైలేజీని డైల్యూట్ చేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి వుండాల్సింది. కానీ, అలా జరగలేదు.

విజయసాయిరెడ్డి సైలెంటయ్యారు.. సజ్జల రామకృష్ణారెడ్డి హంగామా లేదు.. మంత్రి రోజా తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న తలనొప్పులతో దిగాలు పడిపోయారు. వెరసి, వైసీపీ పూర్తిగా నీరసించిపోయింది.