గత ఎన్నికల్లో చిత్తుగా ఓడి కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది తెలుగుదేశం. కానీ గెలిచిన ఆ 23 స్థానాల్లో మాత్రం టీడీపీ ఎంత బలంగా ఉందో ప్రూవ్ అయింది. మొదటి నుండి అ 23 స్థానాలు టీడీపీకి కంచుకోటల్లా ఉన్నాయి. అందుకే వైఎస్ జగన్ హవా ఎంత నడిచినా ఆ 23 చోట్ల మాత్రం టీడీపీదే పైచేయి అయింది. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడిచినా ఆ 23 నియోజకవర్గాల్లోని కొన్నింటిలో ఎలా బలపడాలో వైసీపీకి అర్థం కావట్లేదు. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా రేపల్లె ఒకటి. ఇక్కడ తెలుగుదేశం వేళ్లూనుకుని ఉంది. పార్టీ పెట్టినప్పటి నుండి జరిగిన ఎన్నికల్లో రెండు మూడు సార్లు మినహా మిగతా అన్నిసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.
1985, 94, 99, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే ఇక్కడ జెండా ఎగురవేశారు. మధ్యలో 2004, 2009లో కాంగ్రెస్ తరపున దేవినేని మల్లిఖార్జునరావు, మోపిదేవి వెంకటరమణలు గెలిచారు. 2014కు ముందు మోపిదేవి వైసీపీలో చేరినా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో కూడ అదే సీన్ రిపీట్ అయింది. రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచినా రేపల్లెలో మాత్రం సైకిల్ చక్రమే తిరిగి మళ్లీ అనగాని సత్యప్రసాద్ గెలిచారు. రెండోసారి కూడ ఓడిన మోపిదేవిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఆతర్వాత మండలి రద్దు కావడంతో మోపిదేవిని రాజ్యసభకు పంపారు.
ఇలా వరుసగా రెండుసార్లు ఓడిన అభ్యర్థికి పదవులు కాట్టబెట్టడం వెనుక ఆ నియోజకవర్గంలో ఎలాగైనా బలపడాలనే జగన్ వ్యూహం ఉంది. ఈ వ్యూహం ప్రకారమే మోపిదేవి మంత్రి అయినా, రాజ్యసభకు వెళ్లినా నియోజకవర్గానికి టచ్లోనే ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీచేసే అవకాశం లేదు. అందుకే ఆయన తమ్ముడిని సిద్దం చేస్తున్నారట. మరోవైపు అధికారం లేకపోయినా అనగాని సత్యప్రసాద్ మాత్రం పూర్తి డామినేషన్ చూపిస్తూ ఎప్పటిలాగే చురుగ్గా ఉంటున్నారట. దీంతో నియోజకవర్గంలో ఎలా బలపడాలో పాలుపోక వైసీపీ హైకమాండ్ సైతం బుర్రబద్దలు కొట్టుకుంటోందట.