ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసేంత సీన్ వైసీపీకి లేదని ఇంకోసారి నిరూపితమైపోయింది. ‘అడుగుతూనే వుంటాం..’ అంటూ నిజానికి, వైసీపీ ఎప్పుడో చేతులెత్తేసింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తుందనుకుంటే, అదంతా ఉత్తమాటే అయిపోయింది.
చిత్రమేంటంటే, బీజేపీ అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చేయడమేంటో.! మద్దతు ఇవ్వకపోతే, ఏమవుతుందో వైసీపీకి బాగా తెలుసు. బీజేపీతో అడిగించుకుంటే ఏమవుతుందో కూడా బాగా తెలుసు. అందుకేనేమో, అంత ధైర్యంగా బీజేపీ తన పని తాను చేసుకుపోయింది.
అసలు బీజేపీకి వైసీపీ ఎందుకు భయపడాలి.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 151 మంది ఎమ్మెల్యేలున్నారు వైసీపీకి. 22 మంది లోక్ సభ సభ్యులు, అరడజనుకు పైగా రాజ్యసభ సభ్యులున్న పార్టీ వైసీపీ. ఇంత బలంగా వున్న పార్టీ, ఎందుకిలా చేస్తోంది.? అన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘మొనగాడు’గా అభివర్ణిస్తుంటుంది వైసీపీ. మూడు రాజధానుల విషయంలో కేంద్రం నుంచి మద్దతుని కూడగట్టలేకపోయారు వైఎస్ జగన్. శాసన మండలి రద్దు విషయంలో కావొచ్చు, ఆఖరికి దిశ చట్టం విషయంలో కావొచ్చు.. కేంద్రం నుంచి వైసీపీకి సానుకూలత రాలేదు.
ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు వంటి విషయాల్లో కూడా కేంద్రాన్ని గట్టిగా అడగలేని దుస్థితి వైసీపీది. అయినా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ‘సమర్పించేసుకుంటాం’ అన్నట్టు వైసీపీ ఇలా ఎలా వ్యవహరిస్తోందో ఏమో.!