అమ్మా విడదల రజినీ.. అర్థంచేసుకోవమ్మా 

Vidadala Rajini
అధికారంలో ఉన్న పార్టీలో అంతర్గత కలహాలు మామూలే.  కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు.  ప్రస్తుతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సిట్యుయేషన్ ఇలానే ఉంది.  కీలక నేతల నడుమ మొదలైన విబేధాలు వర్గపోరుగా పరిణామం చెందుతున్నాయి.  గన్నవరం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.  వీటి పరిష్కారానికి హైకమాండ్ తీవ్రంగా కొందరు సీనియర్ నేతలను కేటాయించింది.  ఇతర నియోజకవర్గాల్లో సమస్యలు కొలిక్కి వస్తున్నా గుంటూరులో జిల్లాలో మాత్రం పరిష్కారం దొరకడం లేదు.  చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. 
Vidadala Rajini
 
ఎంపీ సరిగా ప్రొటోకాల్ పాటించడం లేదని, తనకు సమాచారం లేకుండానే నియోజకవర్గానికి రావడం, వైసీపీ నేతల్ని కాకుండా ఇతర పార్టీ నేతలను కలవడం లాంటివి చేస్తున్నారని రజినీ తీవ్రంగా హర్ట్ అయ్యారు.  అప్పటి నుండి ఎంపీ విషయంలో రజినీగారి తీరు మారిపోయింది.  పార్టీ కార్యకలాపాల్లో, నియోజకవర్గ పనుల్లో ఎంపీకి ఎమ్మెల్యే మర్యాదపూర్వక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.  కానీ రజినీ మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదట.  ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా ఉంటుందో సదరు ఎంపీగారికి రుచి చూపాలని ఎమ్మెల్యే గట్టిగా  నిర్ణయించుకున్నారట. 
 
దీంతో ఎంపీ నొచ్చుకున్నారట.  ఎంపీ అయినా కూడా పార్టీలో తగిన మర్యాద దక్కడం లేదని, ఎమ్మెల్యేలు తమను అస్సలు ఖాతరు చేయడం లేదని, నియోజకవర్గంలో ఉండే కంటే ఢిల్లీలో ఉండటమే ఉత్తమంగా ఉందని పంచాయితీ చేయబోయిన నేతల వద్ద ఏకరువు పెట్టుకున్నారట.  విడదల రజినీ అసలే నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్.  ఆమెకు స్టీల్ లేడీ అనే బిరుదు కూడా ఇచ్చారు చిలకలూరిపేట యువత.  ఇప్పుడు ఆమెకంటూ సొంత క్యాడర్ ఏర్పడింది.  వైఎస్ జగన్ కు కూడ మహిళా నేతగా రజినీ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది.  సో.. ఆమెను గట్టిగా మందలించలేకపోతున్నారు సీనియర్ లీడర్లు.  అందుకే దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యకు ఫులుస్టాప్ పెట్టాలని అడుగుతున్నారట నేతలు.