గత ఎన్నికల్లో వైసీపీ కొన్ని అనూహ్యమైన ఫీట్లు సాధించింది. వాటిలో ఒకటి కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడం. రాష్ట్రంలో కమ్మ వర్గం ఎక్కడున్నా వారి మద్దతు పూర్తిగా టీడీపీకే ఉండేది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ దాన్ని బ్రేక్ చేసి కమ్మ వర్గం ఓట్లలో కొంత శాతాన్ని దక్కించుకుంది. ఇదే బలంగా ఉన్న చోట్ల కూడ టీడీపీ ఓడిపోవడానికి కారణమైంది. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా వినుకొండ కూడ ఒకటి. ఈ నియోజకవర్గంలో కమ్మ వర్గం డామినేషన్ పూర్తి స్థాయిలో ఉంటుంది. గెలుపోటములను డిసైడ్ చేసేది వాళ్లే. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున జీవి ఆంజనేయులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్మ సామాజిక వర్గం ఆయనకు బాగా సపోర్ట్ చేసింది. గత ఎన్నికల్లో కూడ కమ్మలు ఆయన వైపే ఉంటారని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. ఈ అనూహ్యమైన మార్పుకు కారణం కమ్మలు వైసీపీ వైపుకు మళ్లడమే. బ్రహ్మనాయుడు కూడ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే కావడం, జగన్ హవా కొంత మేర పనిచేయడంతో టీడీపీకి ఓటమి తప్పలేదు. ఈ ఫీట్ సాధించడానికి బొల్లా బ్రహ్మనాయుడు కమ్మ వర్గానికి చాలా హామీలే ఇచ్చారు. అనేక అభివృద్ది కార్యక్రమాలతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీలో సైతం కమ్మ వర్గానికి పెద్ద పీఠ వేస్తానని బ్రహ్మనాయుడు మాటిచ్చారట. ఆయన మాటల మీద ఆశ పెట్టుకునే కమ్మ వర్గం సగం టీడీపీని కాదని వైసీపీకి జైకొట్టారు.
ఇప్పుడు అదే బొల్లా బ్రహ్మనాయుడుకు తలనొప్పిగా పరిణమించిందని అంటున్నారు లోకల్ వ్యక్తులు. బ్రహ్మనాయుడు గెలవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో తమ ఆశలు నెరవేరుతాయని కమ్మ వర్గం గట్టిగా ఆశలు పెట్టుకుంది. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ది కార్యక్రమాలేవీ జరగలేదట. నామినేటెడ్ పోస్టుల ఊసే లేదట. దీంతో కమ్మ పెద్దలు బ్రహ్మనాయుడు మీద ఒత్తిడి తెస్తున్నారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎమ్మెల్యే నియోజకవర్గానికి మొహం చాటేశారని టాక్. ఈలోపు టీడీపీ నేత ఆంజనేయులు ఆనాడు తనను గెలిపిస్తే వెంటనే టీడీపీలోకి మారిపోతానని నమ్మబలికి బ్రహ్మనాయుడు ఓట్లు దండుకుంటున్నారని, ఇప్పుడు ఒక్క హామీ కూడ నెరవేర్చలేదని మండిపడుతున్నారు. మొత్తానికి ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోతే కమ్మ వర్గం రియాక్షన్ ఎలా ఉంటుందో వైసీపీ ఎమ్మెల్యేకు బాగా తెలిసోచ్చిందంటున్నారు వినుకొండవాసులు.