కరోనా మహమ్మారి దెబ్బకు మానవత్వమే ప్రశ్నార్థకమైంది. వైరస్ సోకడం, నయం కావడం ఒక ఎత్తైతే వైరస్ సోకిన వారి పట్ల వివక్ష పెద్ద సమస్యగా పరిణమించింది. వైరస్ సోకినవారి పట్ల సమాజంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. వైరస్ మీద గెలిచి ప్రాణాలు దక్కించుకున్నా కూడ తోటి మనుషులు చూపే వివక్షను తట్టుకోలేక బాధితులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక కరోనాతో మరణించిన వారి పట్ల జనం మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. చనిపోయినా కూడా శరీరంలో వైరస్ బ్రతికే ఉంటుందని, అప్పుడు కూడా ఆది వ్యాప్తి చెందగలదని తెలియడంతో మృతుల శవాలు అనాధ శవాలుగా శ్మశానాలకు వెళుతున్నాయి.
తల్లిదండ్రులు చనిపోతే బిడ్డలే వారి శవాలను ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు. సొంత బంధువులెవరూ దహన సంస్కారాలు చేయడానికి సాహసించడం లేదు. వాస్తవానికి కరోనాతో ఒక వ్యక్తి మరణించాక అతని శరీరంలోని వైరస్ ఆరు గంటల వ్యవధి తర్వాత చనిపోతుందని వైద్యులు అంటున్నారు. కానీ అది తెలియని జనం సొంత వారి భౌతికఖాయాలకు దహన క్రియలు చేయడానికి భయపడుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ఏపీ ప్రభుత్వం కూడా ఉంది. ఇన్నాళ్లు మాటల ద్వారా అవగాహన తేవాలని ట్రై చేసిన మన నాయకులు ఇక లాభం లేదని నేరుగా రంగంలోకి దిగారు.
వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా వెళ్లి కరోనా మృతుని దహన సంస్కారాల్లో పాల్గొని శభాష్ అనిపించుకున్నారు. తిరుపతిలో కరోనాతో మరణించిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయడానికి ఆయన బంధువులెవరూ ముందుకు రాలేదు. ఈ సంగత తెలుసుకున్న కరుణాకర్ రెడ్డి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషతో కలిసి మృతునికి అంతిమ సంస్కారాలు చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన కోవిడ్ వల్ల చనిపోయిన వారి శరీరంలో 6 గంటల తర్వాత వైరస్ ఉండదని ప్రజలకి అవగాహన కల్పించేందుకు తాము ముందుకు వచ్చినట్లు తెలిపారు. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి దహన క్రియలకు కుటుంబ సభ్యులు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అందరూ మాటలకే పరిమితమవుతున్న సమయంలో ఇలా ఎమ్మెల్యే నేరుగా దహనక్రియలు చేసి చూపడం అభినందించదగిన విషయం.