అధికార వైసీపీలో వర్గపోరులు నడుస్తున్నాయి. ఇన్నాళ్లు ఈ సమస్యలు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్యన, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నడుమ, ఓడిన నేతలు కొత్తగా వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్యనే అనుకుంటే ఇప్పుడేమో రాజ్యసభ సభ్యులతో కూడ కొందరికి పొసగడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి విశాఖ జిల్లా వైసీపీ నేతలకు నడుమ సమస్యలు వెలుగుచూశాయి. తాజాగా పల్నాడులో కూడ ఇదే తరహా విబేధాలు బయటపడ్డాయి. ఈ విభేదాలు ఒక ఎమ్మెల్యేకి, రాజ్యసభ సభ్యుడికి మధ్యన నడుస్తున్నాయి.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి, రాజ్యసభ ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. దీంతో ఎమ్మెల్యే ఒంటరివాడైపోయారని చెప్పుకుంటున్నారు. అయోధ్య రామిరెడ్డికి జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. చాలా సులభంగా రాజ్యసభ ఎంపీ అయ్యారు ఆయన. కొందరిలా జగన్ ను పెద్దగా బ్రతిమాలుకున్న బాపతు కాదు. అడిగి మరీ పదవి తీసుకున్నారు. అది అయోధ్యరామిరెడ్డి పలుకుబడి. అలాంటి వ్యక్తిని ఢీకొంటున్నాడు యువ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ గొడవతో గురజాలలోని మిగతా కీలక నేతలు అందరూ మహేష్ రెడ్డికి దూరమయ్యారట.
నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని మహేష్ రెడ్డి ఎప్పుడో పక్కనపెట్టారట. అది క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. అదేవిధంగా మరొక ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డితోనూ మహేష్ రెడ్డికి పొసగని పరిస్థితి. ఇలా ముగ్గురు పెద్ద తలలతో సున్నం పెట్టుకున్న మహేష్ రెడ్డి ప్రస్తుతం ఒంటరయ్యారు, దీంతో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మహేష్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షం పోరు, అటు సొంత వర్గంలో నిరాదరణ కలిసి మహేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఆ కారణంగానే తాజాగా అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద కన్నెర్రజేస్తున్నారట ఎమ్మెల్యే.