వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంగతి తెలిసిందే. మొదట్లో చిన్నగా అసమ్మతి స్వరం మొదలుపెట్టిన ఆయన మెల్లగా గొంతు పెంచి వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడినీ ఢీకొట్టారు. రఘురామరాజు ఒక్కడే ఒకవైపు ఉంటే వైసీపీ బలగం మొత్తం ఇంకోవైపు నిలబడి యుద్ధం చేసింది. అయినా ఆయన్ను కట్టడి చేయలేకపోయారు. పార్లమెంటులో ఆయన ప్రాముఖ్యతను తగ్గించడానికి, ఆయన మీద అనర్హత వేటు వేయించడానికి జగన్ బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం ఢిల్లీలో కూర్చుని రచ్చబండ పేరుతో ప్రభుత్వాన్ని నిత్యం ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని వాస్తవాలు ఉన్న ఇంకొన్ని విపరీతాలున్నాయి.
విపరీతాలను వైసీపీ నాయకులు ఎలాగూ వదలరు కాబట్టి మనం రఘురామరాజు చెప్పిన వాస్తవాల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. రఘురామరాజు జగన్ మీద విమర్శలు చేసేసరికి తట్టుకోలేకపోయిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ భిక్ష పెట్టిన జగన్ మీదే విమర్శలా, ఆయన లేకపోతే మీరు గెలిచేవారే కాదు అంటూ మాటల దాడి చేశారు. దాంతో రఘురామరాజు మరింత ఫైర్ అయ్యారు. తాను ఎవరి దయా దాక్షిణ్యాల మీదా గెలవలేదని, జగన్ పేరు, ఫోటో పెట్టుకుని అస్సలు గెలవలేదని, సొంత పేరుతోనే నెగ్గానని అన్నారు. కావాలంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలవగలనని సవాల్ విసిరారు. నిజానికి రఘురామరాజు అలా వ్యక్తిగతంగా తనకు తాను ఎలివేట్ చేసుకోవడం మంచి పద్దతే.
ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలంతా ఒకే పంథాలో ఉన్నారు. అధినేత అనుగ్రహం కోసం రకరకాల పాట్లు పడుతున్నారు. జగన్ దృష్టిలో పడటం కోసం తాము గెలిచింది జగన్ ఛరీష్మాతోనేనని, ఆయన లేకపోతే తాము లేమని చెబుతుంటారు. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తవాళ్ళు ఈ మాటలు చెప్పినా అర్థం ఉంది కానీ ఏళ్ల తరబడి రాజకీయాల్లో నలిగినవారు, గతంలో పలుసార్లు గెలిచినవారు కూడ ఇదే మాట అంటుంటే అది భజన కాక మరేమవుతుంది. మైక్ పట్టుకున్న ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే మాట చెబుతుంటే వాళ్లకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కూడ విసుగొచ్చేస్తుంది. ప్రతిసారీ ఇలా సరెండర్ అయిపోయే నాయకులను పనులు చేయమని ఎలా అడగగలం. అడిగినా మాదేముంది అంతా జగన్ దయే అంటారు తప్ప చేస్తాం, చెందుతాం అంటారా అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
సొంత డబ్బాలు కొట్టుకోవడంతో చంద్రబాబును మించిన నేతలు లేరు. కానీ టీడీపీ తరపున గెలిచిన నేతలు ఎవరూ కూడ గతంలో ఈ స్థాయిలో భజన చేసింది లేదు. బాబుగారు గొప్పవారు, అపర చాణుక్యుడు అనేవారు తప్ప ఆయన లేకపోతే మేము లేము, ఆయన బొమ్మ పెట్టుకునే గెలిచాం అంటూ ఏనాడూ తమను తాము తక్కువ చేసుకోలేదు. వాళ్ళంకంటూ ఇక సొంత ఇమేజ్, కెపాసిటీ ఉందని చూపించుకునేవారు. చంద్రబాబు సైతం నేతలను ప్రతిసారీ కాకపోయినా అప్పుడపుడు కన్సిడర్ చేసేవారు. అపాయింట్మెంట్ కోరితే కొంచెం ఆలస్యమైనా ఇచ్చేవారు. కానీ జగన్ మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము డమ్మీలమని చెప్పుకుంటుండటంతో పెద్దగా పట్టించుకోవట్లేదు. కనీసం కలిసే వెసులుబాటు కూడ ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నేతలు ఈ భజన తతంగాలు మానేసి రఘురామరాజు తరహాలో సొంత క్రెడిబిలిటీని చూపించుకుంటే వారికే మంచిది.