2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాన్ని, ఆ విజయం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత త్వరగా మర్చిపోలేరు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం వైసీపీలో ఉత్సహం తగ్గిందని, వైసీపీ నేతలు కానీ జగన్ కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం లేదని చాలా రోజుల నుండి ప్రజల నుండి రాజకీయ నాయకుల నుండి విమర్శలు వస్తున్నాయి. అయితే జగన్ రెడ్డి వేసిన పథకానికి రాష్ట్రంలో ఫ్యాన్ యొక్క స్పీడ్ అమాంతం పెరిగింది. అలా పెరగడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రచించిన నూతన వ్యూహమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఫ్యాన్ స్పీడ్ ను పెంచిన జగన్
కొత్త ఏడాది వరసగా ఎన్నికలు రాబోతున్నాయి. ఇపుడే పార్టీ పట్టాలెక్కాల్సిన సమయం, సందర్భం. అందుకే వీలూ వాలూ చూసి మరీ ఫ్యాన్ స్పీడ్ జగన్ పెంచేశారు అంటున్నారు. ఎటు చూసినా ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల సందడే కనిపిస్తోంది. ఏ జిల్లాలో చూసినా జనంలో నాయకులు, కార్యకర్తలు కలియతిరుగుతూ మమేకం అవుతున్నారు. వైసీపీ ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాదయాత్రకు మూడేళ్ళు అంటూ అక్టోబర్ ఆరున వైసీపీ ఇచ్చిన పార్టీ ప్రొగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అలా శ్రేణులన్నీ మెల్లగా జనంలోకి వచ్చాయి. అది అలా ఉండగానే జగన్ పుట్టిన రోజు వేడుకలు అంటూ డిసెంబర్ నెల మొదటి నుంచే మరో కొత్త సందడితో పార్టీని రీఛార్జి చేశారు. ఇపుడు ఇళ్ళ పట్టాల పండుగ అంటూ పదిహేను రోజుల కార్యక్రమంతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనీయకుండా జగన్ ఒక్క దెబ్బకు బిజీ చేసి పారేశారు.
ఈ ఊపుకు టీడీపీ నిలబడగలదా!!
వైసీపీని ఎలాగైనా దెబ్బతియ్యాలని 2019 ఎన్నికల తరువాత తీవ్రంగా టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్య తలపెట్టినా కూడా దాన్ని ముందుకు సాగనియ్యకుండా కోర్టుల్లో కేసులు వేస్తూ టీడీపీ వైసీపీని ప్రజల్లో దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ గత కొన్ని నెలలుగా జగన్ వేసిన వ్యూహాలు వల్ల రాష్ట్రం మొత్తం వైసీపీ మయం అయింది. ఈ నేపథ్యంలో 2021 వరుసగా వస్తున్న ఎన్నికల్లో వైసీపీ ధాటికి టీడీపీ నిలబడగలదో లేదో చూడాలి.