వైఎస్సార్సీపీ జనాగ్రహ దీక్షలతో వైఎస్ జగన్‌కి లాభమెంత.?

తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన దిగజారుడు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జనాగ్రహ దీక్షలు చేపడుతున్నాయి. నిజానికి, ఇవి పోటీ దీక్షలు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంగళగిరిలో 36 గంటల దీక్ష చేపట్టగా, దానికి పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్షలకు శ్రీకారం చుట్టింది.

టీడీపీ ప్రతిపక్షంలో వుంది గనుక.. దీక్షలు చేస్తోంది. మరి, వైసీపీ ఎందుకు దీక్షలు చేస్తున్నట్టు.? ఈ దీక్షలతో వైసీపీకి ఒరిగేదేంటి.? చంద్రబాబు చేస్తున్న దీక్ష ముమ్మాటికీ, టీడీపీకి పొలిటికల్ మైలేజీ తెచ్చిపెడుతుంది. ఎందుకంటే, అక్కడ ధ్వంసమైన టీడీపీ కార్యాలయం కళ్ళముందు కనిపిస్తోంది. దాన్ని హైలైట్ చేయడం చంద్రబాబు దీక్ష తాలూకు ఉద్దేశ్యం.

అయితే, పట్టాభి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇంకా సర్క్యులేట్ అవుతూనే వున్నాయి.. మీడియాలోనూ మార్మోగుతున్నాయి. వాటి పట్ల జనంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో, వైసీపీ నేతల తాలూకు దిగజారుడు వ్యాఖ్యలు కూడా ప్రొజెక్ట్ అవుతున్నాయి బాగానే.

ఇక, వైసీపీ జనాగ్రహ దీక్షల విషయానికొస్తే.. ఈ దీక్షల్లో, పట్టాభి స్థాయిని దాటి వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుండడం వైసీపీకి ముమ్మాటికీ మైనస్ అవుతుందనే చెప్పాలి. జనాగ్రహ దీక్షలంటే జనాన్ని ఆకర్షించేలా వుండాలి. ‘టీడీపీ మిమ్మల్ని తిట్టిందని టీడీపీ కార్యాలయాలపైకి దాడులకు వెళ్ళారు.. మరి, మీరు తిడుతున్న తిట్ల సంగతేంటి.?’ అనం జనం వైసీపీ నేతల్నినిలదీసే పరిస్థితి వస్తోంది.

పట్టాభిపై ప్రభుత్వం పరంగా చర్యలు ఆహ్వానించదగ్గవే. ఈ చర్యలతో ఇకపై రాజకీయాల్లో ఎవరూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సాహసించకూడదు. కానీ, అలా అదుపు చేసే పరిస్థితి రాష్ట్రంలో వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

వైసీపీ నేతలు శాంతియుత దీక్షలు చేస్తే, టీడీపీ కుట్రలు బయటపడతాయ్. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయ్. కానీ, కొందరు వైసీపీ నేతల తీరుతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదముంది. పట్టాభి దిగజారుడు వ్యాఖ్యల తర్వాత వైఎస్ జగన్ మీద పెరిగిన సింపతీని, వైసీపీ శ్రేణులు జనాగ్రహ దీక్షలతో వృధా చేస్తున్నాయ్.