చంద్రబాబు ఇలాకా ‘కుప్పం’ నుండి బ్రేకింగ్ న్యూస్

చంద్రబాబు ఇలాకా 'కుప్పం' నుండి బ్రేకింగ్ న్యూస్
గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం చంద్రబాబు నాయుడును కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.  40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో కుదుపులు, సంక్షోభాలు చూసిన బాబు ఈ ఓటమితో కుంగిపోయారు.  బయటకి గంభీరంగా కన్పడుతున్నారే కానీ అంతర్గతంగా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.  ఓటమి భారం ఒకలా కుంగదీస్తే బాబుగారికి సొంత నియోజకవర్గం కుప్పంలో మెజారిటీ తగ్గడం మరొక షాక్.  2014తో పోలిస్తే 2019లో బాబుగారికి 20,000 మెజారిటీ తగ్గింది.  ఇంత తేడా కనిపిస్తుందని బాబుగారే కాదు వైసీపీ కూడా ఊహించలేదు.  అందుకే ఈ పరిణామాన్ని గట్టిగా సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావించింది.  అందుకోసం పకడ్బందీ ప్రణాళిక రూపొందిచుకుంది.  
 
ఇంతకు ముందు కనీసం ఏడాదిలో రెండు సార్లు మరీ కుదరకపోతే ఒక్కసారైనా బాబుగారు కుప్పం వెళ్ళి ప్రజల్ని పలకరించి అక్కడి స్థితిగతుల్ని తెలుసుకుని చేయవలసిన పనులు చేసేవారు.  కానీ ఈసారి ఎన్నికలు ముగిసి యేడాది గడిచినా ఆయన కుప్పంలో అడుగుపెట్టలేకపోయారు.  కొన్ని నెలలుగా కరోనా దృష్ట్యా హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యారు.  జూమ్ యాప్ ద్వారా పార్టీ పనులు చూసుకుంటున్నా ఆయన మొత్తం సమయం అమరావతి వివాదంలోనే గడిచిపోతోంది.  ఫలితంగా సొంత నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు.  ఇదే అదునుగా భావించిన వైసీపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది.  ఇన్నేళ్ళు టీడీపీకి కుప్పంలో ప్రధానంగా పనిచేస్తూ వచ్చిన ముఖ్యమైన స్థానిక నేతలను తమవైపుకు తిప్పుకుంటోంది.  
 
ఇప్పటికే టీడీపీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ పార్టీని వీడగా జిల్లా సహకార బ్యాంక్  ఛైర్మన్ శ్యామరాజు సైతం వైసీపీ గూటికి చేరిపోయారు.  జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి కూడా సైకిల్ దిగే అలోచనలో ఉన్నట్టు టాక్.  ఇక స్థానిక వైసీపీ నేతలు కుప్పంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు.  బాబుకు ప్రధాన బలమైన బీసీ వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడానికి స్థానిక బీసీ లీడర్లకు పెద్ద పీఠ వేస్తున్నారు.  అంతేగాక ఇన్నాళ్లు పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చారు.  ఈ వ్యూహం మొత్తం వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో అమలవుతోందట.  వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడగొట్టాలనేది వైసీపీ లక్ష్యం.  ఇంకొన్నాళ్లు బాబుగారు ఇలాగే జూమ్ యాప్ నే నమ్ముకుని పనిచేస్తే వైసీపీ తన లక్ష్యం నెరవేర్చుకునే అవకాశాలు ఇంకా పెరుగుతాయి.