మంగళగిరిలో నారా లోకేష్‌కి వైసీపీ సహకరిస్తోందా.?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి వైసీపీ సహకరించడమేంటి.? మంగళగిరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమి చెందిన విషయం విదితమే. వచ్చే ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి బంపర్ మెజార్టీతో గెలుస్తానని నారా లోకేష్ చెబుతున్నారు. నిన్న మొన్నటిదాకా అయితే, నారా లోకేష్ వ్యాఖ్యలు కామెడీగానే కనిపించాయి.

కానీ, మంగళగిరిలో ఈక్వేషన్స్ మారుతున్నాయి. టీడీపీ కీలక నేతగా వున్న గంజి చిరంజీవి, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి, వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆయనే వైసీపీ నుంచి పోటీ చేస్తారనీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈసారి పోటీ చేసే అవకాశాలు తక్కువగా వున్నాయనీ ప్రచారం జరుగుతోంది.

అనేకానేక ఈక్వేషన్స్‌ని విశ్లేషించిన అనంతరం, వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా గంజి చిరంజీవిని వైసీపీలోకి లాగారన్నది వైసీపీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. గత కొంతకాలంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలో వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీ మీద రాజకీయ పోరాటం చేయడం తప్ప, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండటంలేదని వైసీపీ కింది స్థాయి నేతలే అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారట.

ఇదిలా వుంటే, ‘నారా లోకేష్‌కి మేలు చేసేందుకే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తొక్కేస్తున్నారు..’ అంటూ ఇంకో ప్రచారమూ తెరపైకొచ్చింది. చాలా రిస్క్ చేసి, చంద్రబాబు సహా లోకేష్.. మరికొందరు టీడీపీ నేతల మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు గత కొంతకాలంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అధినేతకి అత్యంత వీర విధేయుడాయన.

అయినాగానీ, ఆళ్ళకు మంత్రి పదవీ దక్కలేదు..  మళ్ళీ పోటీ చేసే అవకాశమూ దక్కకపోవచ్చంటున్నారు. ఇదంతా చూస్తోంటే, పరోక్షంగా నారా లోకేష్‌కి వైసీపీ సహకరిస్తున్నట్లే అనుకోవాలేమో.!