రాజకీయాల్లో ఒక్కోసారి ఒకటి ఆశించి పనిచేస్తే ఊహించనిది ఇంకేదో జరుగుతుంది. ఇంకొన్నిసార్లు అనుకున్నదే జరుగుతున్నట్టు కనిపించినా మధ్యలో ఊహించని మలుపు తిరిగి ఫలితం తలకిందులు అవుతుంది. సరిగ్గా ఈ రెండోదే జరిగింది వైసీపీ విషయంలో. వైసీపీ మొదటి నుండి నారా లోకేష్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. లోకేష్ భవిష్యత్తులో టీడీపీకి కాబోయే సారథి అని జగన్ కు తెలుసు. అందుకే ఇప్పటి నుండే ఆయన మీద గురిపెడితే ఫ్యూచర్లో ఆయన్ను నిలువరించడం సులభమవుతుందనే ఆలోచన ఆయనది. అందుకే లోకేష్ మీద మొదటి నుండి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. లోకేష్ కు లోకజ్ఞానం లేదని, నాయకుడిగా అసమర్థుడని ప్రచారం చేశారు.
విజయసాయిరెడ్డి, కొడాలి నాని లాంటి వారైతే ఆయన్ను పప్పు అని, చిట్టినాయుడని రకరకాల మారుపేర్లు పెట్టి సంభోధించి ప్రజల్లో ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్పడేలా చేశారు. ఇది గత ఎన్నికల్లో బాగానే పనిచేసింది. అంతటితో వైసీపీ ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ లోకేష్ మీద దాడిని యధావిధిగా కొనసాగించారు వైసీపీ లీడర్లు. అంతేనా ఇంకా డోస్ పెంచారు కూడ. లోకేష్ సైతం అవతలి వైపు నుండి ప్రతిదాడి చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి సంభందించిన ప్రతి విషయాన్నీ విమర్శిస్తూ జగన్ నిర్ణయాల్లో తప్పులను వెతకడం స్టార్ట్ చేశారు. జగన్ తమ మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఏకరువు పెట్టారు.
ఇక ప్రభుత్వానికి కోర్టుల్లో వస్తున్న వ్యతిరేక తీర్పులు లోకేష్ విమర్శలకు బాగా ఉపయోగపడ్డాయి. లోకేష్ ఏమీ మాట్లాడనప్పుడే ఆయన మీద రేగిపోయిన వైసీపీ లీడర్లు ఆయన అన్నేసి మాట్లాడితే ఊరుకుంటారా. అందుకే లోకేష్ వేసే ప్రతి ట్వీటుకు, విమర్శకు విధిగా కౌంటర్ వేయడం స్టార్ట్ చేశారు. దీంతో వైకాపా ప్రధాన లీడర్ల రోజువారీ పనుల్లో, లక్ష్యాల్లో లోకేష్ ఒక అంశమైపోయారు. ఇదే లోకేష్ కు ప్రచారాన్ని తెచ్చిపెడుతోంది. అధికార వర్గం మొత్తం ఒకటై ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే అతనికి అంతకంటే వేరే ప్రచారం ఏం కావాలి. ఇదే జరిగింది లోకేష్ విషయంలో. ఇది గ్రహించిన జగన్ బృందంలోని కొందరు అనవసరంగా లోకేష్ కు ఎక్కువ సీన్ ఇస్తున్నామని, హీరోను చేస్తున్నామని అంటూ ఇకనైనా లోకేష్ లెవనెత్తే ప్రతి చిన్న విషయానికీ రెస్పాండ్ కాకుంటే మంచిదని సలహా ఇస్తున్నారట.