నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఎక్కడ.? ఆయన ఈ మధ్య మీడియాలో ఎందుకు తరచూ కనిపించడంలేదు.? కనిపించకనేం.? టీడీపీ అనుకూల మీడియాలో ఆయన కనిపిస్తూనే వున్నారు. కాకపోతే, ఇదివరకటిలా ఆయన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా మరీ అంత ఎక్కువగా ఎంటర్టైన్ చేయడంలేదంతే.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే రఘురామకృష్ణరాజుని పూర్తిగా లైట్ తీసుకుంది.
నిజానికి, రఘురామకృష్ణరాజు ‘రచ్చబండ’ కొనసాగుతోంది. మద్యపాన నిషేధం సహా పలు అంశాలపై ఇటీవల ఆయన మాట్లాడారు, వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వమ్మీదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా చేయాల్సినదానికంటే ఎక్కువ స్థాయిలోనే దుష్ప్రచారం అనండీ, విశ్లేషణ అనండీ.. చేస్తూనే వున్నారు రఘురామకృష్ణరాజు.
గతంలో అయితే, రఘురామకృష్ణరాజు మాట్లాడిన ప్రతి మాటకీ వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చేది. దాంతో, రఘురామ మరింతగా చెలరేగిపోయారు. మాటలు తూటాలు ఇరువైపుల నుంచీ పేలేవి. ఈ క్రమంలో బూతులు కూడా దొర్లేవి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందన్నట్లుగా.. రఘురామకు అటువైపునుంచి కౌంటర్ ఎటాక్ లేకపోవడంతో.. ఆయన ఎంత అరిచి గీ పెట్టినా అది వృధా ప్రయాసే అవుతోంది.
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల భీమవరంలో పర్యటించగా, తన నియోజకవర్గంలో ప్రధాని పర్యటనకు ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం తనకు గౌరవం ఇవ్వలేదనీ, కనీసం ఆహ్వానం పంపలేదని రఘురామ గుస్సా అయ్యారు. ఆ తర్వాతే ఆయనలో గణనీయమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్, రఘురామకు మద్దతు పలకడం, ఆ తర్వాత టీడీపీ రఘురామని లైట్ తీసుకోవడం జరిగింది.
తనంతట తానుగా తప్పటడుగులు వేసి, తన స్థాయిని దిగజార్చేసుకున్న రఘురామ.. ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయారన్నమాట.