తెలుగు రాజ్యం ప్రత్యేక కథనం – జగన్మోహన్ రెడ్డి పిలుపే ఒక ప్రభంజనం

YSRCP Establishment day

YSRCP Establishment day

ఒక యోధుడి మరణం శతవీరుల జననం

ఇంతటితోనే వీరుల గాధలు అంతం కాలేదు..

స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు

అదే నెత్తురు….అదే సత్తువ…అదే స్వేచ్ఛకై ఆరాటం

ఆఖరి శత్రువునావలికంపేదాకా ఆగదు పోరాటం… మహాకవి శ్రీశ్రీ

పై పంక్తులు ఒక సినిమాకోసం సందర్భానుసారంగా శ్రీశ్రీ రచించిన గేయంలోనివి కావచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక విప్లవజ్యోతి జీవితానికి అవి అక్షరాలా వర్తిస్తాయి. ఆయన ఆగ్రహం, ఆవేశం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నుంచి ఎగసిపడిన మహాసహస్రజ్వాలామాలికయే యువజన శ్రామిక రైతు పార్టీ… క్లుప్తంగా చెప్పుకోవాలంటే వైఎస్సార్సీపీ!

ముఖ్యమంత్రి పదవిలో ఉండగా…ప్రజాసేవావిధినిర్వహణలో భాగంగా చిత్తూర్ జిల్లాకు ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఆయన పంచభూతాలకు అర్పించబడ్డాడు. గతంలో మనం చాలామంది ముఖ్యమంత్రులను చూశాము. వారి మరణానంతరం వారి వెలుగు మసకబారింది. వారిని ప్రజలు మర్చిపోయారు..మహానటుడు ఎన్టీఆర్ తో సహా. కానీ వైఎస్సార్ కుటుంబం నుంచి మరొక బాలచంద్రుడు పుట్టుకొచ్చాడు. ఆయన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ అధిదేవతలు ప్రయత్నించారు. కానీ, ఆ వీరుడు దాన్ని నిర్భయంగా ఎదిరించాడు. బానిసత్వమే తప్ప ఆత్మగౌరవంతో ఎదిరించడం అనే లక్షణం లేని కాంగ్రెస్ పార్టీలో ఆ యువనేత ధిక్కరానికి అధిష్ఠానదేవతలు అగ్రహించారు. అయినా ఆయన తొడగొట్టి సింహనాదం చేశాడు తప్ప తలవంచలేదు. మహాభారతంలో మనం దుష్ట చతుష్టయపు కుయుక్తులను మాత్రమే విన్నాము. కానీ ఈ నయవంచక రాజకీయ మహాభారతంలో దుష్ట అష్టయాన్ని చూశాము. ఒక్కడిని చేసి యోధానుయోధులు అందరూ ఏకమై చిత్రహింసలు పెట్టారు. బోనులో బంధించారు. అయినా అతడు కందలేదు. భయం అన్నదే తెలియని మృగరాజులా లంఘించాడు. వైరివర్గం మీదకు ఆయన విసిరిన పాశుపతాస్త్రం పేరే వైఎస్సార్సీపీ!

12-3 -2011 నాడు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ ఇద్దరే సభ్యులుగా ఊపిరి పోసుకున్న వైఎస్సార్సీపీ ఈ దుర్మార్గమైన కుళ్ళు కుతంత్ర రాజకీయాల్లో ఇమడగలుగుతుందా లేదా అని అప్పట్లో అందరూ సందేహించారు. వైఎస్సార్ ఆర్జించుకున్న ఖ్యాతి ముందు మిణుగురుపురుగులకు కూడా సరిపోలని సోనియా, రాహుల్ లాంటి దుష్టగ్రహాలకు తోడు రాష్ట్రంలో పరమ అసమర్ధులైన నికృష్ట నాయకగణం, వీరికి తోడు కుట్ర కుతంత్రాల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అనదగ్గ చంద్రబాబు నాయుడు…ఇక వైఎస్సార్ ను నరనరానా ద్వేషించే కులగజ్జి కమ్యూనిస్ట్ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని బతకనిస్తాయా అనే అనుమానం చాలామందిలో ఉండేది. వైఎస్సార్ ఐదేళ్లు మాత్రమే పాలించినా ఆయన రాజహంస అనిపించుకున్నారు. వైఎస్సార్ వలన ఏదోవిధంగా లబ్ది పొందినవారు, పదవులు పొందినవారు, విశ్వాసపాత్రులు, కుడిచేతులు, ఎడమచేతులు అనుకున్నవారు అందరూ సోనియాగాంధీకి జడిసి జగన్ మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు. ఇంతమంది శత్రువులను చుట్టూ పెట్టుకుని వైసిపి నిలబడగలదా అని విశ్లేషణలు జరిగాయి. దానికితోడు అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గూర్చి జనసామాన్యానికి తెలియదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి జనం మధ్యకు రాలేదు. అంతేకాకుండా 2009 ఎన్నికలకు ముందు దక్షిణభారతదేశంలోనే మెగాస్టార్ గా పేరొందిన చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఇరవై సీట్లను కూడా సాధించలేకపోయారు. అప్పట్లోనే అనేక హిట్ల మీదున్న తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ప్రజారాజ్యానికి ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణంరాజు, ప్రభాస్ లాంటి నటులు ప్రజారాజ్యానికి మద్దతు ఇచ్చారు. పెద్ద నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు. ఇంతమంది హేమాహేమీలు ఉన్నప్పటికీ ప్రజారాజ్యం బొక్కబోర్లా పడింది. 

ఇక ఐఏఎస్ అధికారిగా, రాజకీయపండితుడుగా, విశ్లేషకుడుగా, మీదుమిక్కిలి మేధావిగా ఖ్యాతినొందిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ కూడా లోక్ సత్తా పార్టీని ఎన్నికల్లో పోటీకి పెట్టి రెండువందల యాభై స్థానాల్లో పోటీ చేసినా ఆయన ఒక్కరు మాత్రమే గెలిచారు. అలాంటి ప్రముఖులే పరాజయాలబాట పడితే ఎలాంటి గ్లామర్, అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దగా ప్రభావం చూపించడం కష్టం అని పరిశీలకులు పెదవి విరిచారు. కానీ, జగన్మోహన్ రెడ్డి మొక్కవోని దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధి, పోరాటపటిమ ప్రజలను ఆకర్షించాయి. తొలిసారిగా పదిహేడు ఉపఎన్నికల్లో పోటీ చేసి పదిహేను స్థానాల్లో గెలవడంతో రాజకీయ మేధావులు ఉలిక్కిపడ్డారు. ఆ ఊపు చూసి, ఇక జగన్ ముఖ్యమంత్రి కూడా అవుతారని చాలామంది భావించారు.

కానీ, అంతలోనే రాష్ట్రం విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు పచ్చపత్రికలు, పచ్చ ఛానెల్స్ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని, లేకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని కుతంత్రాలు పన్ని, చంద్రబాబు అనుభవాన్ని పదేపదే హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డిపై విషప్రచారాన్ని గావించాయి. దానికితోడు మోడీకి క్లీన్ ఇమేజ్ ఉండటం, పవన్ కళ్యాణ్ తన పార్టీని పోటీకి పెట్టకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడంతో కేవలం ఒకటిన్నర శాతం తేడాతో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. హైనాలు, గుంటనక్కలు, తోడేళ్ళు మందలు మందలుగా సింహంపిల్లమీద దాడిచేసినట్లు ఒంటరిగా సవాలు విసిరిన జగన్ మోహన్ రెడ్డి పై దాడిచేశాయి. అయినప్పటికీ చలించక జగన్ వీరోచితంగా పోరాడాడు.

ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన వెన్ను చూపి పారిపోయే భీరువు కాదు జగన్ మోహన్ రెడ్డి. కేసులు పెట్టినా, వేధించినా, హత్యాయత్నాలు చేసినా, బెదిరించినా అదరక బెదరక పోరాటాన్ని కొనసాగించారు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టి పదహారు మాసాలపాటు ఎండావాన, చలి..మంచు దేనినీ లెక్క చెయ్యకుండా ప్రజలను చైతన్యవంతులను గావించాడు. నవరత్నాల నిర్మాతగా బడుగువర్గాలవారికి భరోసా కల్పించాడు. చంద్రబాబు నరకాసుర పాలనను చీల్చి చెండాడాడు. 2019 ఎన్నికల్లో పార్టీని అఖండమైన మెజారిటీతో నభూతో నభవిష్యతి అన్న చందాన 151 స్థానాలతో అధికారంలోకి తెచ్చాడు.

రాజకీయనాయకులు ఎలా కష్టపడాలి, ఎలా విశ్వసనీయత సంపాదించాలి, ఎలా ప్రజలగూర్చి ఆలోచన చెయ్యాలి…ఈ అంశాలమీద ఎవరైనా పరిశోధన చేయదలిస్తే అందుకు జగన్మోహన్ రెడ్డి జీవితాన్నే పాఠ్యాంశంగా తీసుకోవాలి. పార్టీని స్థాపించి కేవలం ఎనిమిదేళ్లలో అధికారంలోకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి ఏకైక విజేత! ప్రత్యర్థిని శౌర్యంతో జయించాలి తప్ప కుట్రలు, కుతంత్రాలతో కాదనే పెద్దల హితవును ఆచరణలో చూపించిన విజ్ఞత కలిగిన యువకిశోరం. రాష్ట్రంలో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన పార్టీగా వైఎస్సార్సీపీ ప్రజాహృదయాలలో కొలువైంది.

ఈరోజుతో వైఎస్సార్సిపి తన విజయపధంలో ఒక దశాబ్ధాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులవంటి శ్రీయుతులు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా అనేకమంది నాయకులు, పార్టీ విజయం కోసం నిస్వార్ధంగా అహర్నిశలు కష్టించి పనిచేసిన కార్యకర్తలు, అభిమానులు అందరికీ శుభాకాంక్షలు. వైఎస్సార్సీపీ కనీసం శతవసంతాలు పూర్తి చేసుకుని రిపుంజయుడుగా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.

 

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ విశ్లేషకులు