సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారం జరిపి తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కూడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు మీదున్న అక్రమాస్తుల కేసులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇకపై ఆయన స్టే తెచ్చుకునే వెసులుబాటు కూడ లేదు కాబట్టి రోజువారీ విచారణ జరగనుంది. ఇక ఎక్కువ మొత్తంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నేత వైఎస్ జగన్. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనని చెబుతూ తాను లేకుండానే విచారణ జరిగే వెసులుబాటు తెచ్చుకున్నారాయన. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో ఆయన మీద నమోదైన కేసుల్లో విచారణ వేగం పుంజుకునే అవకాశం ఉంది.
ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు, మిగతా రాజకీయ పార్టీలు జగన్ అవినీతిపరుడని విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న బీజేపీ నేత సునీల్ దియోధర్ సైతం వైకాపా అవినీతిపరుల పార్టీ అనేశారు. అప్పట్లో జగన్ మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారుల్లో ఒకరైన మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం అందరూ ఆరోపిస్తున్నట్టు జగన్ మీద లక్ష కోట్ల అవినీతికి ఛార్జ్ షీట్లు లేవని, కేవలం 15000 కోట్లకు మాత్రమే ఉన్నాయని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మొదటి నుండి జగన్ లక్ష కోట్లు తినేశాడనే ముద్రను బలంగా వేసేశారు.
దీన్ని మొదటి నుండి తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన వైసీపీ శ్రేణులు, నాయకులు జగన్ అవినీతికి పాల్పడి ఉంటే బయట ఉండగలరా, ముఖ్యమంత్రి అయ్యేవారా, కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై పెట్టిన ఆ కేసుల్లో అసలు బలం లేదని, అవి వీగిపోవడం ఖాయమని అంటూ వచ్చారు. ఎప్పుడు విచారణ జరిగినా జగన్ క్లీన్ ఇమేజ్ తో బయటికి వస్తారని బలంగా నమ్ముతున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు జగన్ మీదున్న కేసులు త్వరగా విచారణ జరిగితే ఎలాగూ బూటకపు కేసులే కాబట్టి కొట్టివేయబడతాయని, అప్పుడు ఎవ్వరూ నోరెత్తి మాట్లాడే వీలుండదని, ఇక అక్రమాస్తుల కేసులో, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్ళడం ఖాయమని అంటున్నారు. నిజంగా అభిమానులు నమ్ముతున్నట్టు జగన్ మీదున్న కేసులు తప్పుడువని రుజువైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన తిరుగుండదు.