వైఎస్ జగన్ మాట వైసీపీలో వేద వాక్కని మరోసారి నిరూపితమైంది. ఇటీవలే జగన్ 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. అలా మొత్తం 728 మంది బీసీ నేతలకు పదవులు దక్కాయి. వీరిలో 50 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో పదవుల పంపకం అంటే ఎన్నో లాబీయింగులు, సిఫార్సులు, అలకలు, నిరసనలు ఉంటాయి. కానీ అవేవీ లేకుండా చేశారు జగన్. బీసీ కార్పొరేషన్ల పదవులకు ఎంపికల బాధ్యతను మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద పెట్టారు జగన్.
వారు రెండు నెలల పాటు కసరత్తు చేసి నాయకులను ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఎమ్మెల్యేల సిఫార్సు లేనివాళ్లకు చోటు దక్కింది అలాగే ఎమ్మెల్యేలు రికమండ్ చేసిన కొందరికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. అయినా ఎక్కడా అసంతృప్తి అనేది బయటకి పొక్కలేదు. జగన్ పేర్లు ఫైనల్ చేసే ముందే నాయకులందరికీ అల్టిమేటం జారీచేశారట. కార్పొరేషన్ల విషయంలో ఎలాంటి వ్యతిరేకతా ఉండకూడదని గట్టిగా చెప్పారట. ఇక నాయకుడు చెబితే చేసేదేముంది. అందుకే ఇష్టం ఉన్నా లేకున్నా నేతలు మౌనం పాటించారు. అందుకే అక్కడి బీసీల్లో ఎలాంటిది ఆందోళన లేదు. కానీ టీడీపీ బీసీల్లో మాత్రం అసంతృప్తి తారాస్థాయిలో ఉంది.
పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జులను ప్రకటించినప్పుడు అసంతృప్తులు భగ్గుమన్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఇంఛార్జులకు సహకరించడంలేదు. నిత్యం బాబు వద్దకు పిర్యాధులు వెళుతూనే ఉన్నాయి. నాయకుడు చెప్పాడు, చేసేద్దాం అనే ఆలోచనలో సగం మందికి లేనే లేదు. ఎంతసేపూ సొంత ప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టడంలేదు. అంతెందుకు బీసీ పెద్దలు చంద్రబాబు మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది టీడీపీలో. ఆర్థికంగా పార్టీకి సహకారం అందించకపోగా ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తున్న జనం జగన్ తరహా నాయకత్వం చంద్రబాబుకు చేతకాదని మాట్లాడుకుంటున్నారు.