ఎన్టీయార్, వైఎస్సార్‌ల స్థాయి దిగజార్చే యత్నం చేస్తున్న టీడీపీ, వైసీపీ.!

తెలుగు నేలపై స్వర్గీయ ఎన్టీయార్ కావొచ్చు, స్వర్గీయ వైఎస్సార్ కావొచ్చు.. ఈ ఇద్దరి పేర్లను చెరిపెయ్యడం సాధ్యమయ్యే పనేనా.? అప్పట్లో చంద్రబాబు చేసిందీ తప్పే, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నదీ తప్పే.! రేప్పొద్దున్న ఇంకెవరైనా అధికారంలోకి వచ్చి, పేర్లు మార్చుతామంటే అదీ తప్పే.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. తెలుగు రాజకీయాల్లో పార్టీ పెడుతూనే, అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన ఘనత ఆయనకు తప్ప ఇప్పటికైతే ఇంకెవరికీ లేదు. ఆయన తెచ్చిన సంక్షేమ పథకాల్ని చాలావరకు ఇప్పటికీ ఆయా ప్రభుత్వాలు ఫాలో అవుతూనే వున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పేదేముంది.? పొలిటికల్ డాక్టర్.. అని అనొచ్చాయన్ని. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చినా.. కార్పొరేట్ విద్య అందుబాటులోకి వచ్చినా.. అదంతా వైఎస్సార్ చలవే. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. రోడ్డు మీద అంబులెన్స్ వెళుతోంటే, ఆ శబ్దంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వినిపిస్తారు. అంతలా అంబులెన్సుల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్ళారు.

ఎన్టీయార్ పేరు తీసేసి, వైఎస్సార్ పేరు పెట్టినా తప్పే, వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీయార్ పేరు పెట్టినా తప్పే. నిజానికి, అసలంటూ పేర్లు పెట్టకుండా వుండడమే ఆ నాయకులకు ఇచ్చే గౌరవం. ఓ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేస్తే, ఆయన స్థాయి తగ్గిపోతుందా.? వైఎస్సార్ పేరు పెడితే ఆయన స్థాయి పెరిగిపోతుందా.?

ఈ క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ.. ఈ రెండు రాజకీయ పార్టీలూ ఎన్టీయార్, వైఎస్సార్ పేర్ల విషయమై చేస్తున్న వ్యాఖ్యలతో.. ఆ నాయకుల స్థాయి దిగజార్చే ప్రయత్నం జరుగుతోందన్నది నిర్వివాదంశం. టీడీపీ – వైసీపీ కూడబలుక్కునే.. ఎన్టీయార్, వైఎస్సార్ పేర్లకున్న గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నట్లుంది పరిస్థితి.