ప్రభుత్వాలు ప్రజలకోసం ఎంత ఎక్కువ చేసినా.. ఇంకా ఇంకా చెయ్యాల్సింది చాలానే వుంటుంది. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా.. సొంత డబ్బులు పెట్టి, ప్రజలకు సేవ చెయ్యడు. ప్రజల సొమ్మునే, ప్రజల కోసం ఖర్చు చేయడమే పాలన. అది సక్రమంగా చేసినవాళ్ళకి చరిత్రలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది తప్ప, సొంత పబ్లిసిటీ కోసం ఎంత పాకులాడినా ఉపయోగముండదు.
అసలు విషయానికొస్తే, వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు సొంతిళ్ళ నిర్మాణానికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. గతంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి విన్నాం.. ఎన్టీయార్ ఇళ్ళ గురించి విన్నాం. ఇప్పుడు ఏకంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు రూపుదిద్దుకోనున్నాయి. కొన్ని అయితే ఊళ్ళలా మారబోతున్నాయి. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఓ గొప్ప కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వేలాది ఎకరాల భూమిని పేదల కోసం ప్రభుత్వం సేకరించింది, సమీకరించింది. ఈ క్రమంలో నానా రకాల విమర్శలొచ్చాయి. కొన్ని వివాదాల కారణంగా పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీలో అడ్డంకులు ఇంకా తొలగిపోలేదు. ఆ సమస్యల సంగతి పక్కన పెడితే, వివాదాల్లేని చోట ఇళ్ళ నిర్మాణం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. సకల సౌకర్యాలతో ఈ ఇళ్ళు, కాలనీలు, ఊళ్ళు నిర్మితం కానున్నాయి. జగన్మోహనపురం పేరుతో ఓ ఊరే నిర్మితం కాబోతోంది తూర్పుగోదావరి జిల్లాలో.
విజయనగరంలో మినీ టౌన్ షిప్ ఏర్పాటవుతోంది. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. అయితే, కొన్ని చోట్ల ఇళ్ళు ముంపు ప్రాంతాల్లో నిర్మిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. మరి, అలాంటి చోట్ల ప్రభుత్వం విమర్శలకు తావివ్వకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ళను నిర్మించి ఇవ్వగలిగితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.