దివంగత ముఖ్యమంత్రి, మహానేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన అనేది ఓ స్వర్ణయుగం. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన అందించిన ఆ మహానేత గురించి ఎంత చెప్పినా? తక్కువే. ఆ మహానేత అసువులు బాసిన క్షణాన ఎన్నో గుండెలు ఆయన హృదయానికి దగ్గరగా చేరుకున్నాయి. మహానేత గుండె చప్పుడు వినిపిస్తే చాలని! ఆయన చెంతకే చేరాయి. మహానేతపై ఉన్న అభిమానం..ప్రేమకు తార్కాణమది. తారగా రాలిపోయినా..ధృవ తారగా జనం గుండెల్లో వెలుగొందడం రాజన్నకే సాధ్యమైంది. సుపరి పాలకుడు ప్రజల నాలుకలపై జీవించే ఉంటాడని రాజన్న శిలా శాసనం రాశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే మహా నేత గురించి వర్ణించడమే సాధ్యపడదేమో. అలాంటి మహానేత చుక్కల్లే రాలిపోయినా.. సూర్యుడిలా జగనన్న రూపంలో మళ్లీ ఉదయించాడు. ఆ మహానేతను జగన్ మోహన్ రెడ్డి రూపంలో నేటి రాష్ర్ట ప్రజలు చూసుకుంటున్నారంటే! అతిశయోక్తి కాదు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ పాలనలో తనదైన మార్క్ వేస్తూ మును ముందుకు సాగిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని నిలపుకునే దిశగా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోంది. మహానేత చేపట్టిన ఎన్నో పథకాల్ని యధావిధిగా కొనసాగిస్తూ..వాటికి అదనంగా కొన్ని సౌకర్యాలను కల్పించి సుభిక్షమైన పాలన అందిస్తున్నాడు.
పేదవాడి బ్రతుకును మార్చేసిన `ఫీజ్ రీయింబర్స్ మెంట్`, `ఆరోగ్య శ్రీ` పథకాలను మరింత బలోపేతం చేసారు. త్వరలోనే ఉచిత విద్యుత్, తక్కువ వడ్డీకే పంట రుణాలు తదితర విషయాల్లో జగన్ రైతన్నకు దన్నుగా నిలుస్తున్నారు. రైతు భరోసా..రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని ఓ పండగలా మార్చేసారు. మహానేత పొదుపు సంఘాలకు భారీ ఎత్తున రుణాలు పావలా వడ్డీకే అందిస్తే..జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి వడ్డీ లేని రుణాలే అందిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో బీడు బారిన భూముల్ని సస్యశ్యామలం చేయబోతున్నారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో పాలనలో మహానేతనే మించిపోయే లా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అందుకే రాజన్న తనయుడు అందరి నోట జగనన్న అనే నామ స్మరణే నేడు మారు మ్రోగుతోంది. అలాంటి యువనేతను రాష్ర్ట ప్రజలకు అందించిన మహానేత భువి నుంచి దివికెగసి 11 ఏళ్లు (మరణం: సెప్టెంబర్-02-2009) పూర్తయింది.