వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సరైన పురోగతి కనిపించడం లేదని వివేకా కుమార్తె, జగన్ సోదరి అయిన సునీత మొదటి నుండి ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ హత్య కేసులో చాలామంది రాజకీయ నాయకుల పేర్లు వినబడ్డాయి. వివేకా కుంటుంబం ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యేనని ఆరోపిస్తూ వస్తున్నారు. అప్పట్లో కేసు విచారణకు బాబుగారు నియమించిన సిట్ అధికారులు కూడ కొందరు రాజకీయ నాయకులను విచారించారు. ఆ తర్వాత జగన్ సీఎం కావడం, చంద్రబాబు వేసిన సిట్ బృందాన్ని కాదని ఆయన కొత్తగా సిట్ అధికారులను నియమించడం, అనంతరం వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం జరిగిపోయాయి.
రెండు వారాల పాటు జరిగిన ఈ మొదటి దశ విచారణలో వివేకా కుమార్తెతో పాటు శంకర్ రెడ్డి, సస్పెండ్ అయిన సీఐ శంకరయ్యను, పీఏ కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవితో పాటు మరో పది మంది అనుమానితులను విచారించిన సీబీఐ రెండో దశ విచారణలో చెప్పుల షాప్ యజమాని మున్నా, అతని భార్య, షాపులో పనిచేస్తున్న ఇంకొక వర్కర్ ను, వివేకా ఇంట్లో పనిచేస్తున్న రాజశేఖర్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే ఈ విచారణ సక్రమంగా జరగడం లేదని, సరైన మార్గంలో వెళ్లడం లేదని సునీత, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అనుమానం ఉన్న రాజకీయ నాయకులు ఒక్కరిని కూడ సీబీఐ విచారించడంలేదని, ఎవరెవరో సామాన్యులను విచారిస్తూ చివరికి వివేకా హత్య అక్రమ సంబంధాల కారణంగానే జరిగినట్టు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివేకా కుటుంబం అనుమానిస్తోందట. అందుకే సునీత తన వద్ద ఉన్న కేసు వివరాలను తీసుకుని ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవాలని అనుకుంటున్నట్టు, బీజేపీ అగ్రనాయకులు తలుచుకుంటే కేసులో న్యాయం జరుగుతుంది ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇకవేళ ఇదే నిజమైతే స్వయానా వివేకాకు కుమారుడి వరుసయ్యే జగన్ సీఎంగా ఉండగా వివేకా కుమార్తె న్యాయం కోసం ఢిల్లీ వెళితే మాత్రం ప్రతిపక్షాలు ప్రభుత్వం పరువును తీసే ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు.