వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: వైసీపీ ఎందుకు లైట్ తీసుకుంటోంది.?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ జోరుగా సాగుతోంది. ఈ దఫా సుదీర్ఘ విచారణ జరుగుతోంది. పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకొస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరుల పేర్లు వార్తల్లోకెక్కుతున్నాయి. అయితే, సీబీఐ నుంచి అధికారిక సమాచారం.. అత్యంత పకడ్బందీగా వుంటోంది. మీడియాలో వచ్చే కథనాల్ని సీబీఐ ఎప్పుడూ పట్టించుకోదు. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజకీయ రచ్చ విషయానికొస్తే, అధికార వైసీపీ మీద టీడీపీ ఆరోపణల తీవ్రత పెరుగుతోంది. వైసీపీ మాత్రం, ఈ వ్యవహారాలపై అస్సలు స్పందించడంలేదు. పూర్తి మౌనం పాటిస్తోంది. ‘సీబీఐ విచారణ జరుగుతోంది కదా.. నిజాలు నిగ్గు తేలతాయ్. ఈ వ్యవహారాలపై స్పందించడం అనవసరం.

స్పందించి, వివాదాల్ని కొనితెచ్చుకోవడమెందుకు.?’ అన్న కోణంలో వైసీపీ అధిష్టానం, పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందట.. అందుకే, వైసీపీ నేతల నోళ్ళు అస్సలు తెరచుకోవడంలేదు వైఎస్ వివేకా హత్య కేసు – సీబీఐ విచారణకు సంబంధించి. వైఎస్ వివేకా కుమార్తె సునీత, తమ కుటుంబానికి రక్షణ కావాలని పోలీసుల్ని ఆశ్రయించగానే, తగిన భద్రతను కల్పించేందుకు పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తరఫున చెయ్యాల్సింది చేస్తున్నామనీ, సీబీఐ విచారణ విషయమై మాట్లాడటానికీ ఏమీ లేదని మాత్రమే వైసీపీ నేతలు అంటున్నారు. పూర్తిగా కడప జిల్లాలోనే మకాం వేసేసిన సీబీఐ బృందం, అనుమానితులందర్నీ విచారిస్తోంది. ఈ సందర్భంగా వెలుగు చూసిన విషయాల ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తూ వెళుతోంది. రెండేళ్ళకు పైగా అవుతోంది వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై. ఇప్పట్లో నిజాలు నిగ్గు తేలతాయా.? దోషులు ఎప్పటికి పట్టుబడతారు.? అన్న విషయమై సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది.