UFO: 35 ఏళ్లగా దాచిన రహస్యం.. బ్రిటన్‌లో ట్రయాంగిల్ UFO.. ఏలియన్స్ ఉన్నారా..!

ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనిషిని అయోమయంలోకి నెట్టే రహస్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో నిలిచే విషయం.. UFOలు, ఏలియన్స్. ఆకాశంలో ఒక్కసారిగా ప్రత్యక్షమై, క్షణాల్లో అదృశ్యమయ్యే వింత ఆకారాల ఎగిరే వస్తువులు శాస్త్రవేత్తలకే కాకుండా ప్రభుత్వాలకూ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చూశామని చెబుతున్నా, అవేంటి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం ఎవరికీ లేదు.

ఇప్పుడు తాజాగా బయటపడ్డ బ్రిటన్ ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు ఈ మిస్టరీకి కొత్త మలుపు తిప్పాయి. 1990ల కాలంలో యూరప్ ఆకాశంలో కనిపించిన నల్ల రంగు ట్రయాంగిల్ ఆకార UFOలపై బ్రిటన్ మిలిటరీ అత్యంత సీరియస్‌గా చర్చించినట్లు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. లండన్ సమీపంలోని క్యూ ప్రాంతంలో ఉన్న నేషనల్ ఆర్కైవ్స్‌లో ఈ డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఆ సమయంలో ఈ వింత ఎగిరే వస్తువులు బ్రిటన్ మాత్రమే కాకుండా యూరప్ ఖండం అంతటా కనిపించినట్లు నివేదికల్లో ఉంది. గుర్తించడానికి వీలులేని వేగం, అసాధారణమైన మానవ టెక్నాలజీకి అందని కదలికలు సైనికాధికారులను ఆందోళనకు గురిచేశాయి. ఈ టెక్నాలజీ శత్రు దేశాలకు చెందినదా? లేక మనకు తెలియని ఏదైనా అధునాతన శక్తి వెనుక ఉందా? అనే కోణంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది.

సాధారణంగా UFOలపై ఆరోపణలు వస్తే ప్రభుత్వాలు వాటిని కొట్టిపారేస్తుంటాయి. కానీ ఈ ఘటనలో బ్రిటన్ మిలిటరీ అలా చేయలేదు. రహస్యంగా సమావేశాలు నిర్వహించి, ఆ టెక్నాలజీని మనం కూడా పొందగలమా? భవిష్యత్తులో ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుందా? అనే అంశాలపై ఆలోచన చేసినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ఇదే ఈ ఘటనను మరింత సీరియస్‌గా మారుస్తోంది.

1997 మార్చి 4న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘సండే టైమ్స్’ కూడా ఈ అంశంపై కథనం ప్రచురించింది. ఆకాశంలో కనిపిస్తున్న వింత వస్తువులు నిజమే కావొచ్చని, అవి దేశ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశముందని ఆ కథనం పేర్కొంది. 1989, 1990 మధ్య కాలంలో ఈ ట్రయాంగిల్ UFOలు ఎక్కువగా దర్శనమిచ్చాయని అనేక మంది ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఈ రోజుల్లో వీటిని UFOలు కాకుండా UAPలు – అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామెనా అని పిలుస్తున్నారు. పేరు మారినా మిస్టరీ మాత్రం అలాగే ఉంది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ వింత ఆబ్జెక్టులు F-16 యుద్ధ విమానాల కంటే వేగంగా ప్రయాణించాయని, సూపర్ సోనిక్ స్పీడ్‌ను కూడా దాటేశాయని అంచనా.

ఇదిలా ఉండగా, అమెరికాలో కూడా UAPలపై పరిశోధనలు జరుగుతున్నాయన్న వాదనలు చాలాకాలంగా ఉన్నాయి. ఏరియా 51లో ఏలియన్స్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉన్నా, ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు మాత్రం బయటకు రాలేదు. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా UAPలపై ఫైల్స్ డీక్లాసిఫై కావడం, సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరగడం వల్ల ఈ మిస్టరీపై నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆకాశంలో కనిపించే ఆ వింత నీడల వెనుక నిజంగా ఏముందో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతోంది.