వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: సీబీఐ కీలకమైన ముందడుగు వేసిందా.?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సీబీఐ కీలక నిందితుడు / అనుమానితుడ్ని అరెస్ట్ చేసిందా.? గోవాలో సీబీఐ అదుపులోకి తీసుకున్న సునీల్ యాదవ్ ఎవరు.? ఆయనకీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకీ సంబంధమేంటి.? ఈ వ్యవహారాలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అంతటా జరుగుతోంది. సీబీఐ తన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధిస్తోందంటూ కొద్ది రోజుల క్రితమే సునీల్ యాదవ్ ఆరోపించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఎట్టకేలకు సీబీఐ, సునీల్ యాదవ్‌ని గోవాలో అరెస్ట్ చేయగలిగింది. అతన్ని గోవా నుంచి కడపకు తరలిస్తున్నారు సీబీఐ అధికారులు. అరెస్టుని ధృవీకరించడం మినహా, సునీల్ యాదవ్‌కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం వుందన్న విషయాలపై సీబీఐ పెదవి విప్పడంలేదు.

గత కొద్ది రోజులుగా ఏకధాటిగా విచారణ జరుగుతోంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి. అనుమానితుల్ని పదే పదే సీబీఐ విచారిస్తూ వస్తోంది. వారిలో కొందరి స్టేట్‌మెంట్లను మెజిస్ట్రేట్ సాక్షిగా రికార్డు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండడం గమనార్హం. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. అప్పటో, టీడీపీనే ఈ హత్య చేసిందని వైసీపీ ఆరోపించింది. కాదు, వైసీపీనే.. ఎన్నికలో సింపతీ వేవ్ కోసం వివేకానందరెడ్డిని చంపేసిందని టీడీపీ ఆరోపించింది. దాదాపు రెండున్నరేళ్ళుగా ఈ కేసు విచారణ అస్సలు ముందుకు కదలడంలేదన్న విమర్శలున్నాయి. ఎట్టకేలకు సీబీఐ దూకుడు ప్రదర్శిస్తుండడంతో, ముందు ముందు ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.