ప్చ్.. వైఎస్ విజయమ్మకి డబుల్ షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలో గౌరవాధ్యక్షురాలిగా పని చేశారు వైఎస్ విజయమ్మ. వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పదవిలో ఆమె వున్నారు. అయితే, ఇటీవల వైసీపీ ప్లీనరీ వేదికగా, వైసీపీ గౌరవాధ్యక్ష పదవికీ, అలాగే వైసీపీకీ రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తన కుమార్తె వైఎస్ షర్మిలకు తెలంగాణలో రాజకీయంగా అండగా వుండేందుకోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వైఎస్ విజయమ్మ చెప్పారు. తల్లిగా ఎప్పుడూ కుమారుడు జగన్‌కి అండగా వుంటానని విజయమ్మ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ తెలంగాణ గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకోసం, వైఎస్ విజయమ్మ.. తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, వైఎస్సార్ తెలంగాణ పార్టీలోనూ వైఎస్ విజయమ్మకు చుక్కెదురయ్యేలా వుంది.

‘పదవుల కోసం పని చేయం.. పని చేయడానికి పదవులు అవసరం లేదు..’ అంటూ వైఎస్ షర్మిల, విజయమ్మ విషయమై తాజాగా వ్యాఖ్యానించారు. దానర్థం, వైఎస్ విజయమ్మకు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఎలాంటి పదవులూ వుండవనే కదా.?

ఈ విషయమై సోషల్ మీడియాలో బోల్డన్ని కామెంట్స్ పడుతున్నాయి. విపరీతమైన ట్రోలింగ్ కూడా నడుస్తోంది. షర్మిల ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారోగానీ, అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయంగా విజయమ్మ ‘వెన్నుపోటుకు’ గురయ్యారంటూ నెటిజనం ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.v