తెలంగాణ రాజకీయాల్లోకి సంచలనంలా దూసుకొద్దామనుకున్న వైఎస్ షర్మిలకి ఆది నుంచీ సమస్యలే ఎదురవుతున్నాయి. పార్టీ నుంచి ఒకరొకరుగా వెళ్ళిపోతున్నారు. ‘అదసలు పార్టీనే కాదు, ప్రైవేటు కంపెనీ.. దాని గురించి ఏం మాట్లాడతాం.?’ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ గురించి చాలామంది రాజకీయ నాయకులు లైట్ తీసుకున్నారు. బోల్డంత డబ్బు ఖర్చు చేసి, పార్టీని జనంలోకి తీసుకెళ్ళేందుకు షర్మిల ప్రయత్నించారు. ఖమ్మంలో సభ, హైద్రాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు.. వీటన్నిటికీ చాలానే ఖర్చయ్యిందట. ఇవి కాక, పార్టీ నడిపేందుకోసం జరిగిన ఖర్చులు అదనం. ఇంతా చేసి, షర్మిల ఏం సాధించారు.? అంటే, ఏమీ లేదన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో షర్మిల పార్టీ ఆ దిశగా సమాలోచనలు చేసి, కీలక నిర్ణయం తీసుకుని వుండాలి.
ఎటూ పార్టీ పేరు, జెండా ప్రకటించేశారు గనుక, అభ్యర్థిని కూడా ప్రకటించేసి వుండాల్సింది. గెలవడం, ఓడటం అన్నది వేరే చర్చ. అసలు ఆ ఉప ఎన్నికలపై తమకు ఆసక్తి లేదని షర్మిల ప్రకటించడం గమనార్హం. పోటీ పెట్టకపోవడంపై షర్మిల ఇచ్చిన వివరణ కూడా అర్థరహితంగానే తయారయ్యింది. పోటీ చేస్తాం.. అని గనుక షర్మిల ప్రకటించి వుంటే, హుజూరాబాద్ నుంచే షర్మిల పార్టీ బలం ఎంత.? అన్నదానిపై జనానికి ఓ క్లారిటీ వచ్చేది. కానీ, ఆ అవకాశాన్ని ఆమె చేజార్చుకుంటున్నారు. ఈలోగా పార్టీలోంచి నేతలు జారిపోతున్నారు. వారిని ఆపేంత శక్తి షర్మిలకు లేదాయె. ఏ ఓటు బ్యాంకు మీద షర్మిల అండ్ టీమ్ ఫోకస్ పెట్టిందన్నదాని మీదనే స్పష్టత లేదెవరికీ. అలాంటప్పుడు, తెలంగాణ రాజకీయాల్లో ఏం చేద్దామని ఆమె అనుకున్నారు.? ఏమోగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ బాధ్యతల్ని ఆమె చేపట్టి వున్నా బావుండేది. కానీ, అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమ్మతించలేదట. అదీ అసలు సంగతి.