మొదటి నుండి కాంగ్రెస్ కు, ఆపై తెలంగాణ విడిపోయిన దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులతో నిన్న ప్రత్యేకంగా సమావేశమైన వైఎస్ షర్మిల ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు.
ఈ విషయాన్ని వెల్లడించిన షర్మిల అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి, మరో మూడు రోజుల పాటు షర్మిల బెంగళూరులోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆపై ఆమె హైదరాబాద్ కు వస్తారని, ఆపై పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై దృష్టిని సారిస్తారని తెలిపారు.ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో భేటీపై స్పందించిన ఆయన, వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో వెన్నంటి నడిచిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డని, వారిద్దరి మధ్యా కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే జరిగిందని అన్నారు.
ఇక హైదరాబాద్ నుంచి 21న ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి ఖమ్మంకు బయలుదేరే షర్మిల కాన్వాయ్, రోడ్ నంబర్ 12, మాసబ్ ట్యాంక్, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, చౌటుప్పల్, సూర్యాపేట, పాలేరు మీదుగా సాగుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నేతల కోరిక మేరకే ఈ టూర్ ను షెడ్యూల్ చేసినట్టు తెలిపారు.