వైఎస్ షర్మిల పాదయాత్ర: ఇక్కడా టార్గెట్ రేవంత్ రెడ్డే.!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నేడే ఈ పాదయాత్ర ప్రారంభమయ్యింది. తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సెంటిమెంట్ అయిన చేవెళ్ళ నుంచే షర్మిల పాదయాత్ర మొదలవడం గమనార్హం.

ఇక, పాదయాత్ర ప్రారంభిస్తూ వైఎస్ షర్మిల, షరామామూలుగానే అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గడచిన ఏడేళ్ళలో సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందనీ షర్మిల ఆరోపించారు.

అంతేనా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీదా షర్మిల విమర్శలు గుప్పించడం గమనార్హం. వైఎస్ షర్మిల గత కొన్నాళ్ళుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నా, ఆయన మాత్రం తన మీద షర్మిల చేస్తున్న విమర్శల్ని లైట్ తీసుకుంటున్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రైవేటు కంపెనీగా మాత్రమే ఆయన అభివర్ణిస్తున్నారు. ‘షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఆమె పట్ల మాకు సానుభూతి వుంది. అన్న వైఎస్ జగన్, ఆమెను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేస్తే, తెలంగాణలో వచ్చిపడ్డారు.. ఆమె మీద ఏం విమర్శలు చేస్తాం.?’ అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

అయితే, షర్మిల పాదయాత్రను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. గతంలో.. అంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ ఆమె సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. ఓ మహిళ అంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం అప్పటికీ ఇప్పటికీ దేశంలో అతి పెద్ద రికార్డ్. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలలో షర్మిల పాదయాత్ర కీలక పాత్ర పోషించిందన్నది నిర్వివాదాంశం.

కానీ, షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్రస్తుతం సరైన నాయకుల్లేరు.. ఆమె రాజకీయ వ్యూహాలూ తెలంగాణలో పార్టీ బలపడేలా వుండడంలేదు.