షర్మిల రాజకీయ పరిణతి: ‘స్కిప్’ పాలసీ సూపర్బ్.!

తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానల్ నుంచి ఎలాంటి ప్రశ్నలు తన మీదకు దూసుకొస్తాయో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకి బాగా తెలుసు. అసలు ఆ ఛానల్ ఇంటర్వ్యూ ఓకే చెయ్యడం వెనుకే పెద్ద కథ నడిచి వుండాలి. ‘ఈ రోజు ఉదయం కూడా మా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాతో మాట్లాడారు..’ అని ఆ ఇంటర్వ్యూలో షర్మిల చెప్పడం, షర్మిల ‘రాజకీయ పరిణతి’కి నిదర్శనంగా చెప్పుకోవాలేమో. చాలా ప్రశ్నలకు షర్మిల ‘చిరునవ్వు’ని సమాధానంగా ఇచ్చారు. ఆస్తుల పంపకాలు, వైఎస్ జగన్ జైలుకు వెళితే ఎవరు తదుపరి ఏపీ ముఖ్యమంత్రి అవుతారు.? వంటి ప్రశ్నలకు షర్మిల ఇచ్చిన సమాధానంతో, ఇంటర్వ్యూ చేసిన ఛానల్ అధినేత ఏడవలేక నవ్వాల్సి వచ్చింది. చాలా ప్రశ్నలకు షర్మిల సమాధానం దాటవేశారు.. కానీ, దాటవేసినట్లు కనిపించలేదు.

‘చూద్దాం..’ అని లైట్ తీసుకున్న షర్మిలపై సదరు ఛానల్ అధిపతి ఎలా స్పందించాలో అర్థం కాక విలవిల్లాడారు. అయితే, వైసీపీతో తనకు సంబంధం లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం తాను కలత చెందినట్లు షర్మిల పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. ‘వైఎస్ జగన్ తెరవెనుక వుండి సజ్జలతో అలా మాట్లాడించారు..’ అని షర్మిలను రెచ్చగొట్టేందుకు సదరు ఛానల్ అధిపతి ప్రయత్నించినా, షర్మిల తన సోదరుడి మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు. అయితే, ‘అవసరానికి నన్ను వాడుకుని వదిలేశారు..’ అని అన్న మీద షర్మిల నర్మగర్భంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. వైసీపీలో తనకు సభ్యత్వం కూడా లేదని షర్మిల చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరబోతున్నారు కదా.? అనడిగితే, దానికీ.. ఆయన సంస్థ మా కోసం పనిచేయడానికీ సంబంధం లేదని షర్మిల తేల్చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, షర్మిల పార్టీ కోసం పనిచేయనున్న సంగతి తెలిసిందే. ఆయన, వైఎస్సార్సీపీ తరఫున గతంలో పనిచేశారు, ఇప్పుడూ పనిచేస్తున్నారు.