YS Sharmila: వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల…. తోలుబొమ్మ అంటూ?

YS Sharmila: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల విశాఖ పర్యటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా విశాఖలో పర్యటించిన ఈయన గత 5 సంవత్సరాలలో ఏపీలో జగన్ పాలన గురించి మాట్లాడుతూ ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా విధ్వంస పాలన కొనసాగిందని మాట్లాడారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి అమిత్ షా మాట్లాడటంతో సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల అమిత్ షా అలాగే జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా ఉన్నాయని ఈమె ఫైర్ అయ్యారు. వైసీపీ గత ఐదు సంవత్సరాలుగా విధ్వంస పాలన చేస్తుందని చెప్పిన అమిత్ షా గత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నది కూడా మీరే కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు. మరి ఆ ఐదు సంవత్సరాలు విధ్వంసం జరుగుతుంటే మీరు చోద్యం చూస్తున్నారా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీ దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. ఏపీలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా వైసీపీని వాడుకొని రాష్ట్ర సంపద దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే కర్మ క్రియ బీజేపీ ప్రభుత్వమే అంటూ ఈమె మండిపడ్డారు. గతి పది సంవత్సరాల కాలంలో విభజన హామీలను నెరవేర్చక పోగా ఇప్పుడు మాత్రం రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తున్నట్లు గొప్పలు చెప్పడం సరికాదు. మీ వ్యాఖ్యలపై మీరు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి అంటూ ఈమె డిమాండ్ చేశారు.