YS Sharmila : తెలంగాణలో పార్టీ పెట్టినంతమాత్రాన, ఆంధ్రప్రదేశ్ మూలాల్ని కాదనుకుంటానంటే ఎలా.? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి తనకు పట్టదంటే కుదురుతుందా.? దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నానని చెప్పుకుంటున్న వైఎస్ షర్మిల, ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమితంగా ప్రేమించిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరా.? ఇదెక్కడి చోద్యం.!
‘ఆంధ్రప్రదేశ్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు..’ అంటూ షర్మిల తాజాగా మీడియా ప్రతినిథులకు తేల్చి చెప్పిన వైనం వివాదాస్పదమవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ప్రచారం చేశారు. నిజానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ సీటు కూడా ఆశించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ ఆమె ఓ కీలక పదవిని ఆశించారు. కానీ, ఆమెకు ఆశించినవేవీ దక్కలేదు.
సరే, వైఎస్ జగన్ ప్రోద్బలంతో షర్మిల తెలంగాణలో రాజకీయ కుంపటి పెట్టారా.? అన్నతో విభేదించి, తెలంగాణ రాజకీయాల వైపు దృష్టి సారించారా.? అన్న విషయాల్ని పక్కన పెడితే.. తెలంగాణ మీద ఆమె ఎంత మమకారమైనా చూపించొచ్చు.. కానీ, అంతకు మించి ఆమెకు ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత వుంది.
అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ని అత్యద్భుతంగా పరిపాలించేస్తున్నారనైనా వైఎస్ షర్మిల చెప్పొచ్చు. లేదా, ఆయన పాలన బాగాలేదని అయినా అనొచ్చు. కానీ, రాష్ట్ర సమస్యల పట్ల స్పందించబోనని చెప్పడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ‘తప్పించుకోవాలని’ చూడటం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడొద్దంటున్న షర్మిల, ముందు ముందు తెలంగాణ గురించీ తన వద్ద మాట్లాడద్దనే పరిస్థితి వస్తే.? ఈ ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి వస్తోంది.