తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్‌లో బెంగళూరుకు వెళ్లిపోయిన ఆమె.. సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ వేదికగా షర్మిల ఇవాళ పలువురు కీలక వ్యక్తులు, ముఖ్యనాయకులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమెతో సమావేశం తర్వాత ఒకరిద్దరు నాయకులు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ స్థాపన తేదీపైనా మరికొంత సమాచారం వెల్లడైంది. జగన్‌తో షర్మిల విభేదాలపై ఆమె ముఖ్య అనుచరులు కీలక ప్రకటన విడుదల చేశారు. సోమవారం షర్మిలతో భేటీ అయినవారిలో ప్రముఖ జర్నలిస్టు, జగన్ సర్కారు మాజీ సలహాదారు కె.రామచంద్రమూర్తి కూడా ఉండటం విశేషం. తెలంగాణలో ప్రారంభించబోయే కొత్త పార్టీ విధివిధానాలు, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.
జగన్ సర్కారు మాజీ సలహాదారు రామచంద్రమూర్తితోపాటు ఇవాళ షర్మిలను కలిసివారిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. వైఎస్ అభిమానులుగానో, తాను పెట్టబోయే పార్టీకి సమర్థకులుగానో ముందుకొచ్చే నేతలతో మొదట ఆత్మీయ సమావేశాలు నిర్వహించి, ఆ తర్వాతే పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిసిన తర్వాత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని, ఆయన సమైక్యవాదాన్ని మోస్తోన్న షర్మిలకు ఇక్కడ రాజకీయంగా ఆదరణ ఉండబోదంటూ కొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న కామెంట్లపై రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. వైయస్ ఎంతో మంది ప్రజాప్రతినిధులను తయారు చేశారని, తెలంగాణకు ఎన్నో మంచి పనులు చేశారని చెప్పారు. వైయస్ బతికున్నప్పుడు ఆయన కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగిన నేతలు ఇప్పుడు ఆయనను విమర్శించడం సరికాదని అన్నారు.
షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు సంబంధించి రెండు తేదీలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మే 14 తేదీనగానీ, వైఎస్సార్ జయంతి అయిన జూలై 8నగానీ కొత్త పార్టీని ప్రకటించాలని షర్మిల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జులై వరకు ఆగడం కంటే, మే 14న పార్టీని ప్రకటించేసి, వెనువెంటనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా ప్రారంభిస్తే బాగుంటుందని షర్మిలను కలిసిన నేతలు ఆమెకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.