తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రభావం చూపుతున్నారా.?

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ అయితే పెట్టారుగానీ, ఆ పార్టీని ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. గత కొంతకాలంగా తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించారు, ఆ జెండా పట్టుకునే తిరుగుతున్నారు.

నిత్యం తన చుట్టూ కొంతమంది, వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పట్టుకుని తిరిగేలా షర్మిల ప్లాన్ చేసుకున్నారు. నిజానికి, ఈ రోజుల్లో రాజకీయ నాయకుల వెంట జనం తిరగడం (ఖర్చు పెడితే) పెద్ద కష్టమేమీ కాదు. కానీ, అలా జనాన్ని తిప్పుకోవడానికి చాలానే ఖర్చు చేయాలి.

గతంలోనూ షర్మిల పాదయాత్ర చేశారు గనుక, ఆమెకు పాదయాత్ర కష్టాలెలా వుంటాయో తెలుసు. పాదయాత్రకు ఏమేం అవసరమో కూడా బాగా తెలుసు. అవన్నీ సమకూర్చుకున్నారు. నిజానికి, అది మరీ అంత కష్టమైన వ్యవహారమేమీ కాదు షర్మిలకి.

ఎంత ఖర్చు చేసినా ఏం లాభం.? వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు లేదా నాయకురాలు.. అనిపించుకోదగ్గవారెవరూ షర్మిల వెంట కనిపించడంలేదు. ఒంటరి పోరాటమే చేస్తున్నారు షర్మిల. అయితే, కింది స్థాయిలో షర్మిల పట్ల సింపతీ బాగానే కనిపిస్తోందన్నది తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.

‘ఆడ కూతురు చాలా కష్టపడుతోంది..’ అన్న భావన కొన్ని గ్రామాల్లో (షర్మిల పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో) కనిపిస్తోందట. ఆ లెక్కన, షర్మిల పార్టీ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాజకీయాలపై కాస్తో కూస్తో ప్రభావం చూపడం మొదలు పెట్టిందని అనుకోవాలన్నమాట.