వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అవినీతిపై ఏకంగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతికి తెలంగాణ ప్రభుత్వం పాల్పడిందన్నది వైఎస్ షర్మిల ఆరోపణ. ఆ ప్రాజెక్టుని నిర్మించిన మేఘా సంస్థపైనా ఫిర్యాదు చేశారు వైఎస్ షర్మిల.
నిజానికి, వైఎస్ షర్మిల ఫిర్యాదుతో అరెస్టులు జరిగిపోతాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. బీజేపీ తెరవెనుకాల వుండి వైఎస్ షర్మిలతో ఫిర్యాదు చేయించి, కేసీయార్‌ని అరెస్టు చేయించబోతోందన్న ప్రచారమే నిజమైతే, అది కేసీయార్ నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది.
వరుసగా రెండుసార్లు అధికార పీఠమెక్కారు తెలంగాణలో కేసీయార్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముచ్చటగా మూడోసారి కేసీయార్ అధికార పీఠమెక్కాలంటే, తెలంగాణ సెంటిమెంట్ గతంలో కంటే బలంగా వుండాలి. కానీ, అసలిప్పుడు తెలంగాణ సెంటిమెంటే లేదు. పైగా, భారత్ రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చాక, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీయార్‌కి అవకాశమే లేకుండా పోయిందాయె.
ఒకవేళ కేసీయార్ అరెస్టయితే మాత్రం, తెలంగాణలో సెంటిమెంట్ రగులుతుంది.. కేసీయార్ మీద సింపతీ వర్కవుట్ అవుతుంది. అలా కేసీయార్ అరెస్టవ్వాలంటే, సీబీఐ లాంటి విచారణ సంస్థలకు ఫిర్యాదు వెళ్లాలి. ఆ పని వైఎస్ షర్మిల చేసి పెట్టారు. అంటే, కేసీయార్‌కి వైఎస్ షర్మిల సాయం చేశారన్నమాట.
మరి, గతంలో వైఎస్ జగన్ అరెస్టయి జైలుకు వెళితే, ఆ వెంటనే ఆయన ఎందుకు అధికార పీఠమెక్కలేకపోయారు.? అది వేరు, ఇది వేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో, జగన్ అరెస్టు సెంటిమెంట్ కాస్త డైల్యూట్ అయ్యింది. కేసీయార్ విషయంలో మాత్రం సెంటిమెంట్ డబుల్ డోస్ అయ్యేందుకు అవకాశాలు సుస్పస్టం.
‘కేసీయార్‌ని జైలుకు పంపిస్తాం..’ అని పదే పదే అంటోన్న బీజేపీ, వైఎస్ షర్మిల ఫిర్యాదు పట్టుకుని.. ఆ ముచ్చటేదో తీర్చేస్తే, ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చేయడం ఖాయం.