తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో పాటు తమకు మద్దతుగా నిలిచే వారితో భేటీలు నిర్వహిస్తున్న షర్మిల.. ఏప్రిల్ 9న కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సాధారణంగా పార్టీ పెట్టిన తరువాత ఆ పార్టీ నిర్మాణానికి సంబంధించి కమిటీల ఏర్పాటుపై నేతలు దృష్టి పెడుతుంటారు. కానీ వైఎస్ షర్మిల మాత్రం పార్టీ ప్రకటన కంటే ముందుగానే.. ఈ విషయంలో దూకుడును ప్రదర్శిస్తున్నారు.
పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్ కుమార్తె… ఇందుకోసం కమిటీల ఏర్పాటుపై ఫోకస్ చేశారు.గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16లోపు కమిటీలు ఏర్పాటు పూర్తి కావాలని తనకు సన్నిహితంగా ఉండే నేతలకు స్పష్టం చేశారు. ఈ కమిటీల ఏర్పాటు బాధ్యతలను తన అనుచరుడు పిట్టా రాంరెడ్డికి షర్మిల అప్పగించారు.
పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి ఉన్న అభిమానులతో కమిటీలు ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 1200 మందికి బాధ్యతలు అప్పగించే యోచనలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది. మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు తమకు ఆదరణ ఎక్కువగా ఉందని భావించిన చోట గ్రామస్థాయిలోనూ కమిటీల ఏర్పాటు చేయాలని ఆమె తన సన్నిహిత నేతలకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల పక్కా ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.