Y.S Sharmila: కన్నతల్లి పై కేసు పెట్టిన నువ్వు… మంచి కొడుకు అవుతావా జగనన్న: షర్మిల

Y.S.Sharmila: మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధ్యక్షుడు, తన సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని వైయస్ షర్మిల మరోసారి తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

గత కొద్దిరోజులుగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తుల విషయంలో వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరచూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఈమె మరోసారి ఆస్తుల విషయం గురించి తన అన్నయ్య పై ఆరోపణలు చేశారు.

తల్లి తర్వాత తల్లి అంతటి వాడు మేనమామని, అటువంటి వ్యక్తే తన బిడ్డలకు అన్యాయం చేశారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి పవర్‌ షేర్ల ఎంవోయూపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సంతకం చేశారని షర్మిల తెలిపారు. ఇప్పటికే తనకు పెద్ద ఎత్తున ఆస్తులు ఇచ్చినట్టు జగన్ చెప్పుకుంటున్నారని కానీ నాకు ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని షర్మిల వెల్లడించారు.

విజయమ్మకు సరస్వతి పవర్‌ షేర్లను జగన్‌ గిఫ్ట్‌డీడ్‌ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారు. స్వయంగా తల్లినే జగన్‌ మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉందా లేదా అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలియాలి అంటూ ఈ సందర్భంగా మరోసారి ఆస్తుల విషయంలో తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు.