తెలంగాణలో వైఎస్ షర్మిల ‘గందరగోళ’ రాజకీయం.!

అసలు తెలంగాణలో వైఎస్ షర్మిల చేయదలచుకున్న రాజకీయమేంటి.? వైఎస్సార్ తెలంగాణ పార్టీ ద్వారా ఆమె ఏం సాధించదలచుకున్నారు.? ఏమోగానీ, అందరికన్నా ముందుగా.. 2023 ఎన్నికలకు రెండేళ్ళ ముందే తమ పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించేశారు వైఎస్ షర్మిల. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున ఈపూరి సోమన్న అనే గాయకుడ్ని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. కార్యకర్తల్లో, నేతల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించేందుకోసం వైఎస్ షర్మిల ఈ పని చేసి వుండొచ్చు. కానీ, సమీపంలోనే హజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ఫోకస్ పెట్టేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాకపోయినా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగానే సాగుతోంది. మరి, షర్మిల పార్టీ పరిస్థితేంటి.? హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో తాము పోటీ చేయడంలేదని షర్మిల ఇప్పటికే ప్రకటించేశారు. నిజానికి, పోటీ చేసేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముందుకు వచ్చి వుంటే, రాజకీయంగా సమీకరణాలు ఒకింత ఆసక్తికరంగా మారి వుండేవే. కొత్త రాజకీయ పార్టీకి ఇదొక అద్భుత అవకాశం అవుతుంది. గెలుపోటముల అంశం కాదిక్కడ.. పోటీ చేస్తే, పార్టీ తరఫున ఎంతమందిని ప్రభావితం చేయగలిగాం.? అన్నదానిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకి ఓ అవగాహన ఏర్పడుతుంది. కానీ, మంచి అవకాశాన్ని షర్మిల వదిలేసుకుని, 2023 ఎన్నికల కోసం అభ్యర్థిని ప్రకటించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? అయినా, షర్మిల ప్రకటించిన అభ్యర్థి.. 2023 ఎన్నికల వరకూ వైఎస్సార్టీపీలో వుండాలి కదా.?