YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు. గత కొద్దిరోజులుగా గౌతమ్ అదానీ విద్యుత్ ఒప్పందాలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శించిన ఈమె ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం గౌతమ్ ఆదాని పై చర్యలు తీసుకోలేదు అంటూ కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే ఇటీవల చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…గౌతమ్ అదానీపై చర్యలకు చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలని, ఖచ్చితమైన సమాచారం దొరికితే చర్యలకు తాము సిద్ధమే అంటూ చంద్రబాబు నాయుడు తెలియజేశారు అయితే ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందిస్తూ చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడటం ఈ దశాబ్దపు జోక్ అంటూ సెటైర్లు వేశారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్లారని నిలదీశారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ ఒప్పందం వల్ల ప్రజలపై అధిక విద్యుత్ భారం పడుతుందని ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదానీ పై చర్యలు తీసుకోవడానికి సమాచారం కావాలి అంటూ అడగడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
ఆదానీ పై చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని.. మాజీ సీఎం రూ.1700 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI రిపోర్ట్‌లో వెల్లడించిందని.. అన్ని ఆధారాలు ఉన్నా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడానికి సమాచారం కావాలని అడగడం అంటే ప్రజలను మోసం చేస్తున్నట్లేనని షర్మిల తెలిపారు. ఇలా చంద్రబాబు నాయుడు మాట్లాడటం వెనుక మోడీ ప్రమేయం కూడా ఉందని ఈమె తెలిపారు.
మోడీ డైరెక్షన్‌లో విషయాన్ని పక్కదారి పట్టించారని.. అదానీతో రహస్య అజెండా లేకపోతే విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ఆదానితో విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేసే ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలంటే షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.